పట్టుబడ్డ బ్లాక్‌ మనీ 1429 కోట్లు!

పట్టుబడ్డ బ్లాక్‌ మనీ 1429 కోట్లు! - Sakshi

  • మూడు నెలల్లో ఐటీశాఖ దాడుల్లో పట్టివేత



  • సాక్షి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన భారీ దాడులలో వెయ్యికోట్లకుపైగా నల్లధనం పట్టుబడింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో కేవలం మూడు నెలల్లో రూ. 1429 కోట్లు పన్నుకట్టని ఆదాయం దొరికింది. కాగా, ఈసారి చెన్నైలో ఆదాయ పన్నువసూళ్లు కాస్త తగ్గినట్టు సమాచారం. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు గత ఏడాది చివర్లో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్రమార్కులు పాత నోట్లను మార్చే క్రమంలో ఐటీ గురి నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో పడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున లెక్కలోకి రాని నగదు పట్టుబడ్డట్టు సమాచారం. ముఖ్యంగా మూడునాలుగు నెలల్లో ఐటీశాఖ దాడులు హోరెత్తాయి. ఐటీ వలలో చిక్కినవారిలో అధికార పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఓ వైపు సీబీఐ, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంకోవైపు ఐటీ దాడులు రాష్ట్రంలో దుమారం రేపాయి.



    రూ. 1429 కోట్లు కోట్లు..

    ఆదాయ పన్ను శాఖ సాగించిన దాడుల్లో ఈ నాలుగు నెలల్లో రూ. 1429 కోట్లు తమిళనాడు,పుదుచ్చేరిలో పట్టుబడ్డాయి. మంగళవారం ఐటీ శాఖ వార్షికోత్సవం సందర్భంగా ఆ విభాగం ఉన్నతాధికారి మురళీకుమార్‌ తమ దాడులు, పట్టుబడ్డ నగదు వివరాలను వెల్లడించారు. 2016-17లో తమ ఐటీ సిబ్బంది వంద దాడులు జరిపిందని తెలిపారు. ఇందులో రూ. 3,210 కోట్లు లెక్కలోకి రాని నగదు పట్టుబడిందని చెప్పారు. ఇందులో గడిచిన మూడు నాలుగు నెలల్లోనే రూ. 1429 కోట్లు పట్టుబడిందని చెప్పారు. మొత్తం నగదులో 50 శాతం మేరకు ఈ మూడు నాలుగు నెలల్లో పట్టుబడిందని తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 42 ప్రత్యేక దాడులు జరిపినట్టు, ఇందులో రూ. 428 కోట్లు పట్టుబడ్టట్టు చెప్పారు.



    ఆదాయ పన్ను వసూళ్ల గురించి కమిషనర్‌ పళని వేల్‌రాజ్‌ వివరిస్తూ.. గత ఏడాది రూ. 60,606 కోట్లు వసూలు అయ్యాయని,  ఈ సంవత్సరం రూ. 71,400 కోట్ల మేరకు వసూలుచేయాలన్న టార్గెట్‌తో ముందుకుసాగుతున్నామని తెలిపారు. అయితే, చెన్నైలో మాత్రం పన్ను వసూళ్లు తగ్గినట్టు సమాచారం. రూ.428 కోట్ల మేరకు పన్నువసూళ్లు తగ్గుముఖం పట్టడం చూస్తే.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆదాయ పన్ను వసూళ్ల మీద కూడా పడిందేమోనని అంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top