రాబర్ట్ వాద్రా.. కేజ్రీవాల్ మధ్య గొడవేంటి?

రాబర్ట్ వాద్రా.. కేజ్రీవాల్ మధ్య గొడవేంటి? - Sakshi


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగింది. అదేంటన్నది పూర్తిగా బయటకు రావడం లేదు గానీ... ఈమధ్య కాలంలో తన మీదకు జనాన్ని రెచ్చగొడుతున్నారంటూ కేజ్రీవాల్ మీద వాద్రా విపరీతంగా మండిపడుతున్నారు. కావాలంటే తనతో నేరుగా మాట్లాడాలి గానీ ఇలా నిరాధార ఆరోపణలు చేయొద్దని, అర్థంపర్థం లేని పనులకు పాల్పడొద్దని హెచ్చరించారు. ఈ మేరకు వాద్రా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. ''ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా వినిపించే పేరు రాబర్ట్ వాద్రానే. 'వాద్రా వాళ్లను సజీవంగా తినేస్తాడు' లాంటి వ్యాఖ్యలు చూస్తే ఆయనకు నామీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లుంది. కావాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి, నాతో నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. నా మీద ఆయనకు ఏమైనా కోపం ఉంటే.. ప్రజలను నామీదకు ఎగదోయద్దు. ఢిల్లీ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను'' అని ఆ పోస్ట్‌లో రాశారు.



ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గురించి వాద్రా ఇలా స్పందించారు. ''మీరు కేవలం సత్యేంద్ర జైన్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు, షీలా దీక్షిత్‌ను అరెస్టు చేయరు. ప్రధానమంత్రి రాబర్ట్ వాద్రా గురించి ఏమైనా మాట్లాడితే, ఆయనకు 56 అంగుళాల ఛాతీ ఉందని నేను నమ్ముతాను. వాద్రా ఆయనను సజీవంగా తినేస్తారు... ఢిల్లీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మోదీ వాళ్ల మీద కక్ష తీర్చుకుంటున్నారు. మా పనికి అడ్డు తగులుతున్నారు. అన్ని అడ్డంకులున్నా మేం చాలానే చేస్తున్నాం'' అని కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు



రాబర్ట్ వాద్రా పెద్ద భూకుంభకోణంలో ఉన్నారని కేజ్రీవాల్ 2012లో ఆరోపించారు. డీఎల్ఎఫ్ వాళ్లు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భారీ మొత్తంలో రుణాలు ఇస్తే వాటితో ఆయన కోట్లాది రూపాయల భూములు కొన్నారని.. ఢిల్లీ, రాజస్థాన్, హరియాణాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఎల్ఎఫ్‌కు చేసిన మేలుకు ప్రతిఫలంగానే ఆ కంపెనీ ఆ సొమ్ము ముట్టజెప్పిందని ఆయన ఆరోపించారు. అలాగే 300 కోట్ల విలువైన భూమిని డీఎల్ఎఫ్ వాళ్లు రాబర్ట్ వాద్రాకు కారు చవగ్గా ఇచ్చేశారని కూడా అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top