బంగరు భవితవైపు ఈ చూపు

బంగరు భవితవైపు ఈ చూపు - Sakshi


ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తోన్న నిరవధిక నిరాహార దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు

 

విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరూవాడా ఏకమై ఉద్యమబాట పట్టాయి. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ పల్లెలూ, పట్టణాలూ నినదిస్తున్నాయి. దీక్షకు సంఘీభావంగా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని ప్రజలు నినదిస్తున్నారు. హోదా సాధనకు కట్టుబడి రాష్ట్రాభివృద్ధికోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు నల్లపాడు బాట పట్టారు. రెండోరోజైన గురువారం ఉదయంనుంచే దీక్షా శిబిరంవద్ద జనం పోటెత్తారు. బుధవారం రాత్రి శిబిరంలోనే పడుకున్న జగన్ ఉదయాన్నే తన స్థానంలో యధావిధిగా కూర్చున్నారు. అప్పటినుంచి వచ్చిన వారందరితో చేయి కలుపుతూ, అభివాదం చేస్తూ, పలకరిస్తూ గడిపారు. తమకోసం, తమ భవిష్యత్తుకోసం ప్రత్యేకహోదా కావాలని కృషిచేస్తున్న జగన్‌కు పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ ఉద్యోగాలకోసం తపిస్తున్న జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీయువకులు ఎగబడ్డారు.ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించారు.



మద్దతు తెలిపిన నేతలు

ఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో దీక్షా ప్రాంగణానికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షకోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అభినందించారు. హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలా ఉధృతం చేయాలని గద్దె పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఢిల్లీలో ఆశాభావం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌కు వివరించారు. వాటన్నింటినీ విన్న జగన్ ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుథ్య కార్మికులు తమ సమస్యలను వివరించి ఆయన వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఉద్యోగులు కూడా తాము పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరుకు చెందిన న్యాయవాదులుసంఘీభావాన్ని ప్రకటించారు.



పారిశ్రామికవేత్తల సంఘీభావం

 ప్రత్యేకహోదాకోసం జగన్ నిరవధిక దీక్షపై పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకహోదా అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ జేఏ చౌదరి చెప్పారు. గతంలో ఐటీ రంగానికి పదేళ్లపాటు పన్ను రాయితీలు కల్పించడంవల్లే ఆ రంగం వేగంగా విస్తరించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెడతారని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరి ఆందోళన వ్యక్తంచేశారు. హోదాతోనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమని విశాఖ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని ఫ్యాప్సియో రాష్ట్ర అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని రాయలసీమ గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ఉపాధ్యక్షుడు పి.సతీష్‌కుమార్ ఆకాంక్షించారు.



 ప్రవాసాంధ్రులు, నెటిజన్ల నినాదం...

 ప్రవాసాంధ్రులు ప్రత్యేకహోదాకోసం నినదిస్తున్నారు. జగన్ నిరవధిక దీక్షకు మద్దతుగా పలువురు వీడియోలు తీసి ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌లాంటి సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టు చేశారు.  ఇంకొందరు ప్రత్యేకహోదాకు మద్దతు కూడగట్టేందుకు ఇంటర్నెట్‌లో విస్తృతమైన చర్చ ప్రారంభించారు. ప్రత్యేకహోదాకోసం జగన్ చేస్తున్న దీక్షపై కువిమర్శలు చేస్తున్న అధికార పక్షంపై నెటిజన్లు మండిపడుతున్నారు.   

 

ప్రయోజనాలు వివరించిన పార్టీ నేతలు


 వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, దీనికోసం జగన్ చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఖరిపై చేసిన ఉపన్యాసాలతో ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్ష జరుగుతున్న నల్లపాడు ప్రాంగణం హోరెత్తింది. దీక్షలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్ నేతలు బొత్ససత్యనారాయణ, మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

 జగన్‌కు వైద్య పరీక్షలు


 గుంటూరు: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. 24 గంటలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా వై.ఎస్.జగన్ దీక్ష చేస్తుండటంతో రెండో రోజు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు.  ఉదయం 10.30 గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షర్మిల పరీక్షలు చేయగా రాత్రి 8.30 గంటలకు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు చేశారు. ఉదయం బీపీ 120/80 ఉండగా రాత్రి 130/90 ఉంది. ఉదయం షుగర్ 91 ఉండగా రాత్రి 85 ఉంది. బీపీ,షుగర్‌లు అన్నీ సాధారణంగా ఉన్నట్లు పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు.

 

 దీక్ష @ 40 గంటలు

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి శుక్రవారం తెల్లవారేసరికి 40 గంటలైంది. గుంటూరు వేదికగా బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచి వెల్లువలా వస్తున్న జనాన్ని పలుకరిస్తూనే ఉన్నారు. ఓపిక లేకపోయినా రెండోరోజు దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, మాట్లాడుతూ గడిపారు. గంటగంటకూ పెరుగుతున్న జనం ఆయన దగ్గరకు వచ్చేందుకు, చేయి కలిపేందుకు ఉత్సాహం చూపటంతో అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.  

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top