టీచర్లకు కనీస అర్హత తప్పనిసరి!

టీచర్లకు కనీస అర్హత తప్పనిసరి! - Sakshi


న్యూఢిల్లీ: ఉపాధ్యా యులకు ఉండాల్సిన కనీస అర్హతను కచ్చితంగా నిర్ణయించేలా విద్యా హక్కు చట్టానికి మార్పులు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ‘చిన్నారుల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009’కి చేసే సవరణల వల్ల ప్రస్తుతం శిక్షణ పొందకుండానే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి శిక్షణ తీసుకోవడం తప్పనిసరి కానుంది. విద్యలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. అలాగే సైబర్‌ భద్రత అంశంపై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ–ఇన్‌), యూఎస్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం  గురించి కేంద్ర మంత్రివర్గానికి బుధవారం సమాచారం వచ్చింది. సైబర్‌ భద్రత అంశంలో ఇరు దేశాల మధ్య మరింత సహకారానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.



నాబార్డు మూలధనాన్ని రూ.30 వేల కోట్లకు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నాబార్డు చట్టం–1981కి ప్రతిపాదించిన సవరణల ముసాయిదాను ఆమోదించింది.



వివిధ రకాల వస్తువులు, సేవలపై సెస్సులు, సర్‌చార్జీలను తొలగించేందుకు ప్రతిపాదించిన సవరణలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో కస్టమ్స్‌ చట్టం–1962 సవరణలకు ఆమోదం లభించింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top