మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేము

మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేము - Sakshi


విచారణలో జాప్యం సాకు కారాదన్న సుప్రీం కోర్టు

 ఎర్రకోటపై దాడి కేసులో దోషి వినతి తిరస్కారం

 సమీక్ష పిటిషన్లపై పరిమిత బహిరంగ విచారణ తప్పనిసరి

 మరణ శిక్ష అమలుకాని వారు.. నెల రోజుల్లోగా పునఃవిచారణ కోరొచ్చు

 

 న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయ విచారణ వల్ల ఏళ్లతరబడి జైలులో ఉండాల్సి వచ్చిందన్న ప్రాతిపదిక మీద.. మరణ శిక్షను జీవిత ఖైదుకు మార్చజాలమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే.. మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీల రివ్యూ పిటిషన్లను కోర్టులు బహిరంగంగా విచారించాలని స్పష్టం చేసింది. అన్ని మరణశిక్ష కేసుల్లోనూ గరిష్టంగా 30 నిమిషాల వరకూ పరిమిత మౌఖిక విచారణకు అనుమతించాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో మంగళవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

 

 ఆరిఫ్, మెమన్ సహా ఆరుగురి పిటిషన్లు...

 

 ఎర్రకోటపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై మరణశిక్ష ఎదుర్కొంటున్న మొహ్మద్ ఆరిఫ్.. తనపై కేసు విచారణలో సుదీర్ఘ జాప్యం జరిగిందని, తాను గత పదమూడున్నరేళ్లుగా జైలులో ఉన్నానని, కాబట్టి తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు ముంబైలో 1993 వరుస బాంబు దాడుల కేసులో దోషి యాకూబ్ అబ్దుల్జ్రాక్ మెమన్, మరో నలుగురు సి.ముణియప్పన్, బి.ఎ.ఉమేష్, సుందర్, సోనుసర్దార్‌లుపిటిషన్లు వేశారు. తమ సమీక్ష పిటిషన్లను కోర్టు బహిరంగంగా విచారించి ఉండాల్సిందని కోరారు. ఇప్పటివరకూ ఎక్కువ కేసుల్లో సమీక్ష పిటిషన్లపై న్యాయమూర్తుల చాంబర్లలో నిర్ణయాలు తీసుకునేవారు. కక్షిదారులకు అనుమతి ఉండేది కాదు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. కేసు విచారణలో జాప్యం కారణంగా సుదీర్ఘ కాలం జైలులో ఉన్నందున మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న వాదనను తిరస్కరిస్తూ ఆరిఫ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

 

 ‘సమీక్ష’పై బహిరంగ విచారణ తప్పనిసరి...

 

 అయితే.. మరణశిక్షపై సమీక్ష వినతిపై పరిమిత బహిరంగ (కోర్టు హాలులో) విచారణ చేపట్టాలనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోథా, న్యాయమూర్తులు జె.ఎస్.ఖేహర్, ఎ.కె.సిక్రి, రోహిన్టన్ ఎఫ్ నారిమన్‌లు అనుకూల నిర్ణయం వ్యక్తం చేయగా.. న్యాయమూర్తి జె.చలమేశ్వర్ వ్యతిరేకించారు. ‘మరణ శిక్ష అనేది స్వభావరీత్యా వెనక్కుతీసుకోలేనిది. ఒకసారి మరణశిక్షను అమలు చేస్తే.. దాని ఫలితంగా దోషి ప్రాణాలు తీసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత అటువంటి తీర్పు సరికాదని తెలిసినట్లయితే.. సదరు వ్యక్తి ప్రాణాన్ని తిరిగి వెనక్కు తేవడం సాధ్యం కాదుకనుక దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి.. జీవితానికి సంబంధించిన ప్రాథమిక హక్కు ముడిపడి ఉన్నపుడు.. ఏ ప్రక్రియ అయినా సరే పై రెండు అంశాలను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సహేతుకంగా పరిగణనలోకి తీసుకోవాలి. కనుక.. అన్ని మరణ శిక్ష కేసుల్లోనూ సమీక్ష దశలో కూడా..  రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం పరిమితమైన మౌఖిక విచారణ తప్పనిసరి అని మేం భావిస్తున్నాం’ అని మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును రాసిన జస్టిస్ నారీమన్ పేర్కొన్నారు. అలాగే.. ఇంకా శిక్ష అమలుకాని దోషులు తమ సమీక్ష పిటిషన్లను పునఃవిచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే వారు ప్రస్తుత తీర్పు వెలువడిన నెల రోజుల్లోగా తమ సమీక్ష వినతుల పునర్విచారణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

 

 ‘న్యాయమూర్తుల విచక్షణకే వదిలేయాలి’

 

 అయితే.. మరణ శిక్ష ఎదుర్కొంటున్న దోషి చేసుకున్న సమీక్ష వినతిపై బహిరంగ విచారణ అవసరం లేదని.. దానిని న్యాయమూర్తుల విచక్షణకే విడిచిపెట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. అలాగే.. మరణశిక్ష కేసులను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. అటువంటి కేసులను కనీసం ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించాలని పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top