జియో కొత్త చరిత్ర

జియో కొత్త చరిత్ర


టెలికాం రంగంలో సంచలనాలతో ప్రారంభమైన రిలయన్స్ జియో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ప్రారంభమైన అతి కొద్ది కాలంలోనే 24 మిలియన్ల వినియోగదారులను సాధించిన తొలి కంపెనీగా కొత్త చరిత్రను లిఖించింది. తొలి నెల సగంలో తమ వినియోగదారుల సంఖ్య 16 మిలియన్లుగా ప్రకటించిన కంపెనీ సెప్టెంబర్ 30కు ఆ సంఖ్య 24 మిలియన్లుగా పేర్కొంది.


అయితే, పెరుగుతున్న వినియోగదారులకు సరైన సర్వీసులను జియో అందించగలదా? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. తమ వినియోగదారుల సంఖ్య 16 మిలియన్లుగా జియో పేర్కొన్న కొద్ది రోజుల్లోనే 4జీ నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందనే ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. దీంతో పాటు ట్రాయ్ 4జీ నెట్ వర్క్ లలో జియోకు చివరి ర్యాంకు వచ్చింది.


దీనిపై స్పందించిన జియో ఒక రోజుకు 4జీబీ కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న వారికే స్పీడ్ లో తేడా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తాజా జియో వినియోదారుల సంఖ్య 24 మిలియన్లకు చేరిందని ప్రకటించడంతో నెట్ స్పీడ్ మరింత పడిపోతుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలోని అతిపెద్ద డేటా ప్రొవైడర్ జియోనే. చైనా మొబైల్, వొడాఫోన్ గ్లోబల్ లు జియో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. టైర్-2 నగరాల్లో జియోకు అత్యధిక వినియోగదారులు ఉన్నారు. వీటిలో గుజరాత్ 1.5 మిలియన్ల వినియోదారులు, తెలంగాణ 1.2 మిలియన్ల వినియోగదారలతో మొదటి రెండు స్ధానాల్లో ఉన్నాయి. న్యూఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో అతి కొద్ది మంది మాత్రమే జియోను వినియోగిస్తున్నారు.


టెలికాం రంగ దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్లు టైర్-1 నగరాల్లో పటిష్ట కవరేజ్ ను కలిగివున్నాయి. సంచలనాల జియోను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో టైర్-1 నగరాల్లో పట్టు సాధించేందుకు జియోకు కష్టాలు తప్పడం లేదు. ప్రారంభంలో జియో వెల్ కం ఆఫర్ వినియోగదారుల్లోకి బాగానే వెళ్లినా, జనవరి 1, 2017 నుంచి వినియోగదారులు నెట్ కోసం రీచార్జ్ చేయించుకోవాలి. 


ఇంటర్ కనెక్ట్ పాయింట్ల కొరత జియోను వేధిస్తోంది. జనవరిలోగా ఈ సమస్యను కంపెనీ పరిష్కరించుకోకుంటే కచ్చితంగా సమస్యలు ఎదుర్కొవాల్సివుంటుంది. గుజరాత్, తెలంగాణాల తర్వాత తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో జియో అత్యధిక యూజర్లను కలిగివుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top