క్రమబద్ధీకరించని కట్టడాలను కూల్చేస్తాం

క్రమబద్ధీకరించని కట్టడాలను కూల్చేస్తాం


- చట్టపర అడ్డంకులు, ఇతర అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్ధీకరణ: తలసాని

- దేవాదాయ, వక్ఫ్, నాలా, చెరువు, మున్సిపల్ స్థలాల్లో నిర్మాణాలను ఉపేక్షించం

సాక్షి, హైదరాబాద్:
చట్టపరమైన అడ్డంకులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధీకరించేందుకు ఆస్కారం లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలాలు, చెరువులు, మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కాదని, వాటిని కూల్చివేయక తప్పదని చెప్పారు. కూల్చివేతల వల్ల ఇళ్లను కోల్పోయే పేదలకు ప్రభుత్వం అమలు చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద పునరావాసం కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావుతో మంత్రి తలసాని నేతృత్వంలోని కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది.



ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాలు, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ, కొత్త భవన నిర్మాణ పాలసీ రూపకల్పన తదితర అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం త్వరలో ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్‌లో మళ్లీ కొత్త అక్రమ కట్టడాలు పుట్టుకురాకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతో చివరిసారిగా ఈ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.



భవిష్యత్‌లో క్రమబద్ధీకరణలకు అవకాశం ఉండబోదని, ఒకవేళ ఎక్కడైనా అక్రమ కట్టడం/లే అవుట్ వెలిసినా.. ఆ ప్రాంత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కొత్త భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తాకట్టు(మార్ట్‌గేజ్) నిబంధన వల్ల ప్రస్తుతం పేదలు 100 గజాలు, 150 గజాల్లో సైతం ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పొందలేకపోతున్నారని, పేదలకు ఈ విషయంలో సడలింపు ఇస్తామన్నారు. నగరంలోని కోటి 42 లక్షల మంది జనాభా అవసరాలకు తగ్గట్లు సదుపాయాలను కల్పించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకనే అక్రమ కట్టడాలు, లేఅవుట్‌లు పుట్టుకొస్తున్నాయని, దీనికి పరిష్కారంగా అన్ని శాఖల అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top