50 లక్షల కొత్త రూ. 500 నోట్లు రెడీ
త్వరలో కొత్త 500 రూపాయల నోట్లను కూడా బ్యాంకులకు పంపనున్నారు.
న్యూఢిల్లీ: కరెన్సీ కష్టాలు త్వరలో తీరనున్నాయి. రద్దు చేసిన 500, 1000 రూపాయల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన 500, 2000 రూపాయల నోట్లు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకుల్లో ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండగా, కొత్త 500 రూపాయల నోటు ఇంకా చెలామణిలోకి రాలేదు. త్వరలో కొత్త 500 రూపాయల నోట్లను కూడా బ్యాంకులకు పంపనున్నారు.
మహారాష్ట్రలో నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్‌పీ)లో ముద‍్రించిన 50 లక్షల కొత్త 500 రూపాయల నోట్లు రిజర్వ్‌బ్యాంకు చేరుకున్నాయి. రెండో విడతలో మరో 50 లక్షల 500 రూపాయల నోట్లను బుధవారం కల్లా ఆర్‌బీఐకు పంపుతామని సీఎన్‌పీ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ‍్యలో 20, 50, 100 రూపాయల నోట్లను ముద్రించారు. ఆర్‌బీఐ ఈ నోట్లను బ్యాంకుల పంపనుంది. ఈ నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కరెన్సీ సమస్య తీరుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 40 కోట్ల 500 రూపాయల నోట్లను ముద్రించాలని సీఎన్‌పీకి ఆదేశాలు వచ్చాయి.
గత మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను తక్షణం రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. పాత నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించినా పరిమిత స్థాయిలో అనుమతించారు. అలాగే బ్యాంకుల్లో డబ్బు డ్రా చేసుకునేందుకు నిబంధనలు విధించారు.


