సీబీఐ విచారణకు డిమాండ్

సీబీఐ విచారణకు డిమాండ్

పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో తమ కుమార్తె రసీలా రాజు (24) దారుణ హత్యకు గురైన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ డీజీపీకి వారు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తె మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. దర్యాప్తు సరైన కోణంలోనే జరుగుతోందా.. సరైన నిందితుడినే అరెస్టు చేశారా లేదా అన్న విషయంలో తమకు అనుమానాలు ఉన్నట్లు ఆమె తండ్రి రాజు చెప్పారు. తన కుమార్తెను ఆమె మేనేజర్ మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని, బెంగళూరు బదిలీ కోరినా ఇవ్వకుండా అదనపు గంటలు పనిచేయించారని చెప్పారు. 

 

పోలీసులు అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డు అసలు ఆ భవనంలో పనిచేయడని, అలాంటప్పుడు అతడు ఆమె ఆఫీసులోకి, అందులోనూ క్యూబికల్ వరకు ఎలా రాగలిగాడని రాజు ప్రశ్నించారు. ఐడీ కార్డులు స్వైప్ చేస్తే తప్ప ఎవరూ క్యాంపస్‌లోకి కూడా వెళ్లలేరని, అలాంటిది ఒక సెక్యూరిటీ గార్డు అక్కడకు ఎలా వెళ్లిపోయాడని అన్నారు. టీమ్ లంచ్‌కి రానని చెప్పినందుకు ఆదివారాలు కూడా రాత్రి వరకు ఒక అమ్మాయితో పనిచేయించడం ఏంటని అడిగారు. 

 

ఇప్పటికి తన కుమార్తె మరణించి 11 రోజులైనా ఇప్పటికీ పుణె పోలీసులు తమను సంప్రదించలేదని, కుటుంబ సభ్యులను ఎలాంటి వివరాలు అడగలేదని అన్నారు. ఇప్పటివరకు తాము ఆమె అంత్యక్రియలలో బిజీగా ఉన్నామని, ఇప్పుడు అక్కడకు వెళ్లి అసలు ఏం జరుగుతోందో చూస్తామని రాజు చెప్పారు. కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే ఇదంతా చేశాడంటే నమ్మేలా లేదని, అసలు ఏం జరిగిందన్న విషయంపై తమకు స్పష్టమైన సమాధానం కావాలని అన్నారు. పుణెలోని ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదో అంతస్థులో గల కాన్ఫరెన్స్ రూంలో తన క్యూబికల్ వద్ద రసీలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కంప్యూటర్ కేబుల్‌ను ఆమె పీకకు బిగించి చంపేశారు. ఈ కేసులో భాబెన్ సైకియా అనే సెకయూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top