నిజాంలాగే కేసీఆర్‌ నిరంకుశ పాలన: రాంమాధవ్‌

నిజాంలాగే  కేసీఆర్‌ నిరంకుశ పాలన: రాంమాధవ్‌ - Sakshi


హైదరాబాద్‌ : నాటి నిజాం నిరంకుశ ధోరణిలోనే నేడు తెలంగాణలో నియంతృత్వ పోకడలో పరిపాలన కొనసాగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ​ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసమే టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమయంలో ఉత్తిమాటలు చెప్పిందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో కె.లక్ష్మణ్ చేసిన యాత్రను విఫలం చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.



‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దీటైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. 2019లో 350 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు గానూ అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయం. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ పై పూర్తి దృష్టి  పెట్టింది’’ అని రాంమాధవ్‌ అన్నారు.



టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది: లక్ష్మణ్‌

తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..  ఎందుకు విమోచన దినోత్సవం జరపడం లేదనే స్పష్టమైన వివరణ ఇవ్వకుండా సీఎం తప్పించుకున్నాడని.. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులు..తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేశారని చెప్పారు. కంచె ఐలయ్య గారి వ్యాఖ్యలు.. సామాజిక వర్గాలను కులం పేరుతో దూషించినట్లు ఉందని, అశాంతి రేపడం మంచిది కాదన్నారు. అట్టడుగు వర్గాల కోసం మాట్లాడే వ్యక్తి అయితే.. సామాన్య కులం నుండి వచ్చిన మోదీ ప్రధాని అయితే గర్వ పడాల్సిన ఐలయ్య.. దూషించడం తగదన్నారు. పనిగట్టుకొని కొన్ని సామాజిక వర్గాలను దూషించడం కోసం  కొందరు సాయం చెయ్యడం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి విషయాల మీద  ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top