జైలులోనే సజీవ సమాధి అవుతా..

నళిని, మురుగన్‌(ఫైల్‌)


- సంచలనానికి తెరలేపిన ‘రాజీవ్‌ గాంధీ హంతకులు’

- ఆమరణ నిరశనకు సిద్ధపడ్డ మురుగన్‌.. హైకోర్టుకు నళిని

- దంపతులు త్వరలో విడుదలవుతారన్న న్యాయవాది




వేలూరు:
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మురుగన్‌, నళిని దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. గడిచిన 26 ఏళ్లుగా కారాగారవాసం గడుపుతోన్న తనకు.. విడుదలవుతానన్న నమ్మకం లేదని, అందుకే జైలులోనే సజీవ సమాధి కావాలనుకుంటున్నట్లు మురుగన్‌ కోరుతున్నాడు. ఈ మేరకు తాను ఉంటోన్న వేలూరు సెంట్రల్‌ జైలులోనే ఆగస్టు 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశాడు.



శనివారం జైలులో మురుగన్‌ను కలిసివచ్చిన అనంతరం అతని తరఫు లాయర్‌ పుగళేంది ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల సెంట్రల్‌ జైలులో మురుగన్, పేరరివాలన్, శాంతనులతో పాటు ఏడుగురు జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే.



మురుగన్‌-నళిని దంపతుల కుమార్తె.. ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అరిత్ర త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నది. కుమార్తె వివాహన్ని దగ్గరుండి జరిపేందుకుగానూ ఆరు నెలల పెరోల్‌ అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు. పెరోల్‌ కోసం నళిని గత నవంబర్‌లోనే వినతి పత్రం సమర్పించారని, గత జనవరిలో రెండోసారి కూడా విన్నవించుకున్నా అధికారుల నుంచి స్పందన రాలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు న్యాయవాది చెప్పారు. సోమవారం చెన్నై హైకోర్టులో నళిని తరఫున పిటిషన్‌ వేయబోతున్నట్లు పేర్కొన్నారు.



నళిని-మురుగన్‌ త్వరలో విడుదలవుతారు!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నళిని-మురుగన్‌లను  విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది అన్నారు. కాగా, గతంలోనూ వీరి విడుదలకు తమిళ ప్రభుత్వం ప్రతిపాదను పంపడం, కేంద్ర ప్రభుత్వం దానిని నిరాకరించడం పలుమార్లు జరిగింది. 



1991లో జైలుకు వచ్చేనాటికి నళిని రెండు నెలల గర్భవతి అని, ఆమెకు అరిత్రా అనే కుమార్తె జన్మించిందని, నాలుగు సంవత్సరాల పాటు ఆ పాప తల్లితోపాటే జైలులో ఉందని, ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నదని నళిని-మురుగన్‌ల న్యాయవాది పుగళేంది గుర్తుచేశారు.

(చదవండి: రాజీవ్‌ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top