ధర్మాధినేతా.. యుద్ధానికి సిద్ధం

తమ్ముడు రజనీకాంత్‌తో సత్యనారాయణ గైక్వాడ్‌


- జులైలో రజనీకాంత్‌ పార్టీని ప్రకటిస్తారు..

- సూపర్‌స్టార్‌ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్‌ సంచలన ప్రకటన

- భారీ పోస్టర్లతో అభిమానుల కోలాహలం

- పొలిటికల్‌ ఎంట్రీకి శతృఘ్న మద్దతు.. కమల్‌ నిరాకరణ




సాక్షి ప్రతినిధి, చెన్నై:
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట రోజుకో పరిణామం వెలుగుచూస్తోంది. జులైలో పార్టీ ప్రకటన ఉంటుందని రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ శుక్రవారం మీడియాకు చెప్పారు. అటు తలైవాను ఆహ్వానిస్తూ మదురై జిల్లాలో భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి.



‘యుద్ధం వస్తుంది..అప్పుడు కలుద్దాం...వెళ్లిరండి’ అంటూ రజనీకాంత్‌ తన అభిమానులతో చెప్పిన మాటలకు సమాధానంగా.. ‘ధర్మత్తిన్‌ తలైవా పోరుకు తయార్‌’ (ధర్మాధినేతా.. యుద్ధానికి మేము సిద్ధం) అని పోస్టర్లలో రాశారు.

కురుక్షేత్ర సంగ్రామంలోని కృష్ణార్జునుల చిత్రాలను, ‘ధర్మం తప్పినప్పుడు అవతరిస్తా’ అన్న శ్రీకృష్ణుడి మాటలన రజనీకి ఆపాదిస్తూ ఫ్యాన్స్‌ పోస్లర్లను రూపొందించడం గమనార్హం​. జయలలిత, కరుణానిధి లేని రాజకీయాలు కళతప్పాయి, ఈలోటును భర్తీ చేయడం తమ తలైవా వల్లనే సాధ్యమని మదురై అభిమానులు వ్యాఖ్యానించారు.



జులైలో పార్టీ ప్రకటన

రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే అభిమానులు, సన్నిహితులతో చర్చలు జరిపిన రజనీకాంత్‌ జులైలో పార్టీని ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ చెప్పారు. బెంగళూరులో నివాసం ఉంటోన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘అవినీతిని అంతం చేయడానికే నా తమ్ముడు(రజనీ) రాజకీయాల్లోకి వస్తున్నాడు. అది చారిత్రక అవసరం కూడా. పార్టీ పేరు, జెండా, ఎజెండా తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. జులైలో ప్రకటన ఉంటుంది’ అని సత్యనారాయణరావు తెలిపారు.



తక్షణమే రాజకీయాల్లోకి రావాలి: శతృఘ్నసిన్హా

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని, సొంతపార్టీ పెట్టాలని బాలీవుడ్‌ నటుడు, రజనీ స్నేహితుడైన శతృఘ్నసిన్హా శుక్రవారం ట్వీటర్‌లో కోరారు. తమిళనాడులోని టైటానిక్‌ హీరో, భారతదేశ ముద్దుబిడ్డ, ప్రియమైన రజనీకాంత్‌ లేచిరా.. లేచిరా.. లేచిరా...ఇది తమిళనాడును మీరు పాలించాల్సిన సరైన సమయం అని ట్వీట్‌ చేశారు. ప్రజలు మీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని సూచించారు. స్నేహితునిగా, అభిమానిగా, శ్రేయోభిలాషిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎదైనా సహాయం అవసరం అనుకుంటే చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.



ఇది సమయం కాదు: కమల్‌హాసన్‌

తమిళ స్పృహ ఉన్నవారెవరైనా తమిళనాడులో రాజకీయా ల్లోకి రావొచ్చని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు సంపాదించేందుకే రాజకీయాలనే ధోరణి అందరిలోనూ మారాలని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలని రజనీకాంత్‌ చెప్పిన మాటలు సమర్థనీయమన్నారు. ఎవరైనా సరే.. రాజకీయ ప్రవేశానికి ఇది తగిన సమయం కాదని పరోక్షంగా రజనీకాంత్‌కు హితవు పలికారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top