పళని బలపరీక్ష చెల్లదు!

పళని బలపరీక్ష చెల్లదు! - Sakshi

  • మద్రాస్‌ హైకోర్టులో డీఎంకే పిటిషన్‌

  • బలపరీక్ష రద్దు చేయాలని విజ్ఞప్తి



  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను చేపట్టాలని కోరినా స్పీకర్‌ ధన్‌పాల్‌ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్‌లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్‌ జి.రమేష్‌, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.



    బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.



    శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్‌ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్‌ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్‌ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top