భవిష్యత్తులో మనకు ముప్పే!

భవిష్యత్తులో మనకు ముప్పే!


ఇస్రో పీఎస్‌ఎల్‌వీ–సీ37 ప్రయోగంపై మాధవన్‌ నాయర్‌  

బెంగళూరు: ఏకకాలంలో ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఆ సంస్థ మాజీ చైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



ప్రయోగం విజయవంతమైన రోజున.. ఇస్రోకు 400 ఉపగ్రహాలను కూడా పంపే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని కొనియాడిన ఆయన.. ముందుచూపు లేకుండా ఇటువంటి ప్రయోగాలు చేపట్టడం సరికాదంటూ పరోక్షంగా ఇస్రో పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ ప్రతినిధితో ఫోన్‌ ద్వారా మాట్లాడిన నాయర్‌.. ఇస్రో ప్రయోగం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...



ఇటీవల ఇస్రో ప్రయోగంతో మన సామర్థ్యం ప్రపంచానికి తెలిసొచ్చింది. అయితే ఇలాంటివి వందేం ఖర్మ 400 ఉపగ్రహాలను కూడా పంపే సామర్థ్యం మనకుంది. అయితే ఇలాంటి ప్రయోగాలు చేపట్టే ముందు వాటివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై కూడా దృష్టి సారించాలి. మొన్న మనం ప్రవేశపెట్టిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే మనవి. మిగతా 101 ఉపగ్రహాలు విదేశాలవే. అందులో 88 నానో ఉపగ్రహాలు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీకి చెందినవే. డబ్బులు వస్తున్నాయి కదా.. అని ఇష్టమున్నట్లుగా ఉపగ్రహాలను పంపుకుంటూ పోతే.. భవిష్యత్తులో అవి మనకే ముప్పుగా పరిణమించవచ్చు. (ఒకేసారి 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్‌)



ముఖ్యంగా భారత్‌ ప్రవేశపెట్టే ఉపగ్రహాల మనుగడనే అవి ప్రశ్నార్థకం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఉపగ్రహాలన్నీ నిర్ణీత కాలపరిమితి మేరకు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అవి అంతరిక్షంలో తుక్కు వస్తువులుగా మారిపోతాయి. ఇలా తుక్కువస్తువులుగా మారుతున్న ఉపగ్రహాల సంఖ్య పెరిగిపోతే.. వాటిని నియంత్రించేవారు లేక అవి విచ్చలవిడిగా అంతరిక్షంలో ఓ దిశ లేకుండా తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి  పనిచేస్తున్న ఉపగ్రహాలను సైతం ఢీకొట్టే అవకాశం ఉంది. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంపిన ఉపగ్రహాలు కూడా పనికి రాకుండా పోయే ప్రమాదముంది. ప్రస్తుతం డబ్బు వస్తుందనే ఆశతో ఇతరుల ఉపగ్రహాలను కూడా మనం మోసుకెళ్తే... మన అవసరాల కోసం పంపిన ఉపగ్రహాలు సైతం నిరుపయోగంగా మారే ప్రమాదముంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top