మళ్లీ బదిలీల జాతర

మళ్లీ బదిలీల జాతర


నేటి నుంచి ఈ నెల 15 వరకు.. ప్రతిభ, పనితీరు ఆధారంగానే...

ఆదాయార్జన, సేవా విభాగాలకు వేరుగా ఉత్తర్వులు

ట్రెజరీ, సర్వే, అర్థగణాంక శాఖలకు మినహాయింపు

సంవత్సరం మధ్యలో బదిలీ చేయొద్దని విజ్ఞప్తి


 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బదిలీల జాతరను మళ్లీ ప్రాంభించింది. బుధవారం నుంచి ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది మధ్యలో బదిలీ చేయడం వల్ల పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందంటూ ఉద్యోగులు వేడుకున్నా కనికరించలేదు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే బదిలీల ఉన్న నిషేధాన్ని సడలిస్తున్నామని జీవోలో పేర్కొనడం గమనార్హం. శాఖల వారీగా ఉన్నతాధికారులే(కాంపిటెంట్ అథారిటీ) ఉద్యోగుల ప్రతిభ, పనితీరు ఆధారంగా పారదర్శక విధానంలో బదిలీలు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పనులు, ఎక్సైజ్, రవాణా.. తదితర ఆదాయార్జన శాఖలు, వైద్య, ఆరోగ్యం, విద్య.. తదితర శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్ విభాగంలోని జోనల్, మల్టీ జోనల్, సర్వే-ల్యాండ్ రికార్డ్స్, అర్థగణాంక శాఖలను మినహాయించారు.

 

ఇప్పటికే రెండుసార్లు ఉత్తర్వులు


 ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది ప్రభుత్వం రెండుసార్లు ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలోని కమిటీ ఆమోదముద్ర వేసిన జాబితా ప్రకారమే బదిలీలు చేస్తామంటూ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బదిలీల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, బదిలీల ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. అధికారులే(కాంపిటెంట్ అథారిటీ) బదిలీలు చేస్తారంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.



 పాత ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా జాగ్రత్త

 బదిలీల ప్రక్రియను మే 31లోగా ముగించాలంటూ ప్రభుత్వం తొలుత ఉత్తర్వు జారీ చేసింది. తర్వాత జూన్ 9-15 మధ్య చేపట్టాలని మరో ఉత్తర్వు ఇచ్చింది. ఒకేచోట 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే తప్పనిసరిగా బదిలీ చేయాలని తొలి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం, తర్వాత 3 సంవత్సరాలు పూర్తి చేస్తేనే బదిలీ చేయాలంటూ సవరించింది. రెండోస్థాయి గెజిటెడ్ అధికారులకు స్థానిక జిల్లాలో పోస్టింగ్ ఇవ్వకూడదనే నిబంధనను కాస్త సడలించి, మూడోస్థాయి గెజిటెడ్ అధికారులకే ఈ నిబంధన పరిమితం చేస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. ‘సొంత మండలం’ నిబంధననూ మార్గదర్శకాల నుంచి తొలగించింది. ఇన్ని మలుపులు తిరిగిన బదిలీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల్లో(జీవో-98లో) పాత బదిలీ ఉత్తర్వుల(జీవో-57, 58, 59,  61, 63)ప్రస్తావన లేకుండా ప్రభుత్వ జాగ్రత్త పడింది. పాత జీవోల ప్రస్తావిస్తే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుంది. మళ్లీ ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళితే కోర్టు ధిక్కారం కింద ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ధిక్కారం నుంచి తప్పించుకోవడానికి పాత ఉత్తర్వుల సంగతిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మరిచిపోయింది.



 బదిలీ ఉత్తర్వులపై ఉద్యోగుల ఆందోళన

 విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలల పరీక్షలు జరుగుతున్న తరుణంలో బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. వినతిపూర్వక బదిలీలు మాత్రమే చేసేలా తక్షణమే ఉత్తర్వులను సవరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జేఏసీ ప్రతినిధులు ఆర్థిక మంత్రి యనమలకు వినపతిపత్రం సమర్పించారు.  



 పీఆర్సీ సిఫార్సులపై 11న సమావేశం

 పీఆర్సీ సిఫార్సులు, ప్రత్యేక అలవెన్స్‌లపై కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం గురించి ఈ నెల 11న జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని యనమల చెప్పారు. మరోవైపు రాజధానికి ఉద్యోగుల తరలింపుపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని భాగస్వామ్య సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం భేటీ కానున్నారు.

 

 వసూళ్ల మేరకే బదిలీలు!


 బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. బదిలీలు చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేయలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ఆధారంగా బదిలీలు చేపట్టాలని సూచించింది. బదిలీల ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, నియమావళిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. జీవోతోపాటే నియమావళినీ వెల్లడించడం సంప్రదాయం. తాజా జీవోలో మార్గదర్శకాలు, నియమావళి లేకపోవడంతో.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బదిలీలు చేస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. ఇప్పటికే భారీగా వసూళ్లు చేసిన నేపథ్యంలో.. సొమ్ము వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వసూళ్ల మేరకు బదిలీలు చేయడానికి, ‘సొంత మనుషుల’కు అవకాశం కల్పించడానికే మార్గదర్శకాలు జారీ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top