సాయిబాబాకు బెయిలిస్తాం

సాయిబాబాకు బెయిలిస్తాం


30లోగా మహారాష్ట్ర వైఖరి చెప్పాలి: బాంబే హైకోర్టు

ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ఆయనకు బెయిలు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వికలాంగుడైన సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని పూర్ణిమా ఉపాధ్యాయ్ అనే సామాజిక కార్యకర్త రాసిన లేఖను సూమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్ శుక్రవారం ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది.



సాయిబాబా ఏడాదినుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. సాయిబాబాకు గతంలో సెషన్స్‌కోర్టుతోపాటు హైకోర్టు కూడా సాధారణ బెయిలును తిరస్కరించినట్టు పూర్ణిమా ఉపాధ్యాయ్ తన లేఖలో వివరించారు. దీనిని పరిశీలించిన డివిజన్ బెంచ్, గతంలో బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటికీ ఈ సారి ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంలో మహారా ష్ర్ట ప్రభుత్వం ఈనెల 30 లోగా తన వైఖరిని చెప్పాలని ఆదేశించింది.



ఆ రోజు దీనిపై మళ్లీ విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 90 శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా వీల్‌చైర్ సాయంతో మాత్రమే కదలగలుగుతారు. నరాల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న సాయిబాబాను హైకోర్టు, ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పరీక్షలకోసం పంపించింది. అలాగే సాయిబాబా కోరుకున్న ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేయించాలని హైకోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top