కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక?
న్యూఢిల్లీ: సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేసేందుకే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
తన సోదరిని పార్టీలోకి తీసుకురావాలని దాదాపు మూడు నెలలుగా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఆమెకు కీలక బాధ్యత అప్పగించాలని ఆయన భావిస్తున్నారు. ఆయన ప్రయత్నాలను పార్టీ సీనియర్ నేతలు స్వాగతించినట్టు తెలుస్తోంది. కాగా, సెలవుపై వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ఢిల్లీకి తిరిగివచ్చే అవకాశముంది. ఏప్రిల్ 1 నుంచి పార్టీ పునర్ వ్యవస్థీకరణపై రాహుల్ దృష్టి పెడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.