ప్రియాంక.. చాలానే చేశారు!

ప్రియాంక.. చాలానే చేశారు! - Sakshi


ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. ఇక రెండు రోజుల్లో జాతకాలు కూడా బయటపడతాయి. ఇప్పటివరకు ప్రచారంతో పాటు ఎన్నికల మంత్రాంగంలో తలమునకలుగా ఉన్న నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు తమ మనసులో మాటలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే ఈసారి ఉత్తరప్రదేశ్ మీదే ఎక్కువ మంది దృష్టి సారించారు. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల్లో అధికార పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కేవలం అమేథీ, రాయ్‌బరేలీలకే పరిమితం కాకుండా యావత్ యూపీలో ప్రచారం చేయాలని ముందునుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ ఆమె చాలా తక్కువగా మాత్రమే కనిపించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక.. ప్రచారంలో మాత్రం అంతగా కనిపించలేదు. అయితే.. ఆమె కేవలం భౌతికంగా వచ్చి ప్రచారం చేయడం మాత్రమే కాదని.. ఇంకా చాలా చేశారని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అంటున్నారు. ఆమె ఎన్నికల మేనేజ్‌మెంట్, పర్యవేక్షణ లాంటి ప్రధానమైన కార్యక్రమాలు చూసుకున్నారని తెలిపారు. దాంతో పాటు నాయకులను సమన్వయం చేసుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా వాళ్లతో పనిచేయించడం లాంటివన్నీ ఆమే చూశారట. ఇవన్నీ ఢిల్లీ నాయకత్వం పర్యవేక్షణలోనే జరిగాయని.. ప్రియాంక యూపీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్నారని గులాం నబీ అన్నారు.



ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర బీజేపీ నాయకులు కులమతాల ఆధారంగా ఓటర్లను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నించినా అది వారికి సాధ్యం కాలేదని విమర్శించారు. తాను యూపీలో పలువురు హిందువులతో మాట్లాడానని, వాళ్లంతా కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారని చెప్పారు. ఒకప్పుడు బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ఇప్పుడు ఎలా కలిసి పనిచేశాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తుల కన్నా చాలా మెరుగ్గా ఉందని ఆజాద్ సమాధానమిచ్చారు. తమ కూటమి విజయం సాధించడం ఖాయమని.. 2014 నాటి సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top