‘గ్యారేజ్’పై రాజకీయం!

‘గ్యారేజ్’పై రాజకీయం! - Sakshi


- గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకూ ఇలానే అడ్డంకులు

- బాలకృష్ణ, లోకేశ్ తీరుపై జూనియర్ అభిమానుల ఫైర్

- కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరికలు

- సీఎం వద్ద పంచాయితీ.. ఎట్టకేలకు అనుమతి


 

సాక్షి, అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాకు థియేటర్ల కోసం జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఆటంకాలు కల్పించడం అప్పట్లో దుమారానికి దారితీసింది. తాజాగా సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోకు అడ్డంకులు కల్పించేలా తెరవెనుక రాజకీయం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరికలతో ఆ వ్యూహం ఫలించలేదు. నందమూరి తారక రామారావు సొంత జిల్లాలోనే జూ.ఎన్టీఆర్ సినిమాకు బ్రేకులు వేయాలని చూడటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తే మచిలీపట్నం కలెక్టరేట్, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామంటూ జూనియర్ అభిమానులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను కలిసి హెచ్చరించారు. ఇది మరో వివాదంగా టీడీపీ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఎట్టకేలకు మంగళవారం రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 31 అర్ధరాత్రి దాటిన తరువాత జిల్లా వ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా 34 బెనిఫిట్ షోలు ప్రదర్శనకు అనుమతించాలని మూడు రోజుల క్రితమే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను డిస్ట్రిబ్యూటర్లు రాతపూర్వకంగా కోరారు.



పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతిలేదంటూ కృష్ణా జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూటర్లకు మంగళవారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో వివాదానికి దారితీసింది. సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి వద్దకు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. సినిమా బెనిఫిట్ షో అనుమతి నిరాకరణ వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉండటంతో మంత్రులు సైతం మౌనముద్ర దాల్చినట్టు సమాచారం. చివరకు   చంద్రబాబు వద్దకే ఈ పంచాయితీ వెళ్లింది. జూనియర్ సినిమాను అడ్డుకుంటే బాలకృష్ణ, లోకేశ్ ఇలా చేశారని ప్రజలు విశ్వసిస్తారని,   ఇది మంచిది కాదని సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు  చెప్పినట్లు సమాచారం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top