నా ప్రభుత్వ మతం భారత్

నా ప్రభుత్వ మతం భారత్ - Sakshi


ప్రభుత్వ మతవైఖరిని తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

 

నా ప్రభుత్వ మతం తొలుత భారత్ (ఫస్ట్ ఇండియా).. మత గ్రంథం భారత రాజ్యాంగం.. ఆరాధన దేశభక్తి.. ప్రార్థన ప్రజాసంక్షేమం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శుక్రవారం సమాధానమిస్తూ.. తనపై, తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ‘మతతత్వ’ విమర్శలకు లోక్‌సభ వేదికగా స్పష్టమైన జవాబిచ్చారు. రాజ్యాంగ పరిధిలో అన్ని మతాలు పరిఢవిల్లాలనే విధానానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. భూసేకరణ బిల్లులో మార్పుచేర్పులకు సిద్ధమని చెబుతూనే.. స్వాతిశయం వీడి సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా.. పేదరిక నిర్మూలనలో  కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఉపాధి హామీ చట్టమే నిదర్శనం అంటూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు.    

 

 న్యూఢిల్లీ: తనపై, తన ప్రభుత్వంపై పడిన మతతత్వ ముద్రను చెరిపేసే దిశగా తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేశారు. దేశ సమైక్యత భావనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజ్యాంగ పరిధిలో అన్ని మతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శుక్రవారం లోక్‌సభలో బదులిస్తూ గంటంబావు భూసేకరణ బిల్లు సహా అంశాలవారీగా ప్రభుత్వ వైఖరిని తెలిపారు. రైతుల ఆందోళనలను, విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణ ఆర్డినెన్సు స్థానంలో తీసుకువచ్చిన బిల్లులో మార్పుచేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయాలను, స్వాతిశయాన్ని పక్కనబెట్టాలని విపక్షాలకు సూచించారు.

 

 మూడు రంగులే కన్పించాలి.. రాజకీయ కారణాలతో మతాన్ని తెరపైకి తేవడం వల్ల దేశం నాశనమైందని, హృదయాలు పగిలిపోయాయని మోదీ అన్నారు. ‘నా ప్రభుత్వ మతం తొలుత భారత్.. నా ప్రభుత్వ మత గ్రంథం భారత రాజ్యాంగం.. నా ప్రభుత్వ ఆరాధన దేశభక్తి. నా ప్రభుత్వ ప్రార్థ ప్రజలందరి సంక్షేమం’ అంటూ కవితాత్మకంగా వివరించారు. భిన్నత్వం నిండిన దేశమిదని, ఇక్కడ తాను మూడు రంగులను(జాతీయ జెండా) తప్ప మరే వర్ణాన్నీ చూడలేదని పేర్కొన్నారు. ‘మతం పేరుతో అవాకులు చవాకులు పేలడాన్ని అనుమతించకపోవడం ప్రధానిగా నా బాధ్యత.

 

 మతం పేరుతో వివక్ష చూపే హక్కు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు’ అని తేల్చి చెప్పారు. హిందూత్వ సంస్థల మతతత్వ ప్రకటనలను ప్రధాని ఖండించకపోవడంపై వెల్లువెత్తిన విమర్శలను ప్రస్తావిస్తూ.. ‘వారి నోళ్లు మూయించేందుకు నా వద్ద వేయి సమాధానాలున్నాయి. కానీ అర్థంలేని ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ సమయం వృథా చేసుకోదల్చుకోలేదు’ అన్నారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా 2013లో పట్నాలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. ‘హిందువులు ఎవరితో పోరాడాలి.. ముస్లింలతోనా? లేక పేదరికంతోనా?.. ముస్లింలు ఎవరితో పోరాడాలి.. హిందువులతోనా? లేక పేదరికంతోనా? అని అప్పుడు ప్రశ్నించానని గుర్తు చేశారు.

 

 అహంకారం వద్దు.. తన సుదీర్ఘ ప్రసంగంలో.. నల్లధనం, అవినీతి, ఉపాధి హామీ పథకం, బొగ్గు క్షేత్రాల కేటాయింపు.. ఇలా  కాంగ్రెస్‌ను విమర్శించేందుకు, యూపీఏ పథకాలను ఎద్దేవా చేసేందుకు లభించిన ఏ అవకాశాన్నీ ప్రధాని వదల్లేదు. తాము తీసుకువచ్చిన భూసేకరణ చట్టమే శ్రేష్టమైనదనే అహంకారాన్ని విడనాడాలని కాంగ్రెస్‌కు సూచించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాతా దేశంలో నెలకొని ఉన్న పేదరికానికి సజీవ ప్రతీక ఉపాధి హామీ చట్టం.

 

 నేనా పథకాన్ని రద్దు చేస్తాననుకుంటున్నారా? నా రాజకీయ జ్ఞానం నన్నలా చేయనివ్వడం లేదు. గత అరవై ఏళ్లుగా పేదరికాన్ని నిర్మూలించలేని మీ వైఫల్యానికి నిదర్శనం ఆ చట్టం. స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లయినా పేదలు గుంతలు తవ్వుతూ ఉండాల్సిందేనని చెప్పే ఆ పథకాన్ని కొనసాగిస్తూనే ఉంటాను’ అని అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య అన్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పేదల కోసం రూపొందించిన చట్టాన్ని అపహాస్యం చేశారంటూ మోదీని ఆక్షేపించారు. ఏళ్లతరబడి మోదీ సీఎంగా ఉన్న గుజరాత్‌లో ఇంకా పేదరికం ఎందుకు ఉందన్నారు. ఆ తర్తా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి ప్రసంగంలో తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు కోరిన సవరణలను సభ తిరస్కరించింది.

 

 సహకరించండి..రాష్ట్రాలకు సాధికారత కల్పిస్తూ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు, స్వచ్ఛభారత్, జనధన యోజన, అవినీతి, నల్లధనంపై పోరు.. తదితర ప్రభుత్వ పథకాలకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. భూసేకరణ బిల్లును పరువుప్రతిష్టల అంశంగా తీసుకోవద్దని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ‘మీరు 2013లో భూసేకరణ చట్టాన్ని చేసినప్పుడు పూర్తిగా సహకరించాం.

 

 అందులో మీరు రాజకీయ లబ్ధిని ఆశిస్తున్నారన్న విషయం మాకు తెలుసు. అయినా  మద్దతిచ్చాం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలూ ఆ చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. అది రైతు ప్రయోజనాలకే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఆ చట్టం రక్షణ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని రక్షణ వర్గాలు చెప్పాయి. ఏ అవసరం కోసం భూమిని సేకరిస్తున్నామో చెప్పడం కన్నా ఆ విషయాలు వివరిస్తూ పాకిస్తాన్‌కు లేఖ రాయడం మంచిది అని వారన్నారు. అందుకే అవసరమైన మార్పులతో బిల్లును తీసుకువచ్చాం’ అని వివరించారు.

 

 ‘బిల్లులో ఇంకా లోపాలున్నాయని మీరు భావిస్తే.. మా దృష్టికి తీసుకువస్తే మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. రాజకీయ నేతలెఉ కానీ, ఎవరైనా కానీ విదేశాల్లో నల్లధనం అకౌంట్లు ఉన్నవారినీ ఎవరినీ వదలబోమని  స్పష్టం చేశారు. అవినీతి రహిత వ్యవస్థను రూపొందించాల్సి ఉందని, అందుకు పార్టీలనీ సహకరించాలని అభ్యర్థించారు. ‘పరస్పర ఆరోపణలతో కాలం గడుపుతూ ఉంటే.. అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదిస్తున్న వారు అలా సంపాదిస్తూనే ఉంటారు’ అన్నారు.

 

 ‘ప్రధాని బాగా మాట్లాడారు..’ ప్రధాని ప్రసంగం అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని బాగా మాట్లాడారని, అయితే మాటలు కడుపు నింపవని, అందుకు చేతలు కూడా అవసరమని ఎద్దేవా చేశారు. అనంతరం, రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలో జరుగుతున్న మత హింస ప్రస్తావన ఉండాలంటూ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ చేసిన సవరణ తీర్మానంపై ఓటింగ్ జరగ్గా 63 మంది సవరణను సమర్ధించి, 203 మంది వ్యతిరేకించగా ఆ తీర్మానం వీగిపోయింది.

 

 

 మతం పేరుతో అవాకులు చవాకులు పేలడాన్ని అనుమతించకపోవడం పధానిగా నా బాధ్యత. మతం పేరుతో వివక్ష చూపే హక్కు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు.

 - లోక్‌సభలో ప్రధాని మోదీ

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top