ఆ లక్ష కోట్లు ఏమైనట్లు? ఎవరు మేసినట్లు?

ఆ లక్ష కోట్లు ఏమైనట్లు? ఎవరు మేసినట్లు? - Sakshi


'కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాభివృద్ధి కోసం రూ. 3.76 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో రూ.2.70 లక్షల కోట్లకు మాత్రమే లెక్కలున్నాయి. మిగతా రూ. 1.06 లక్షల కోట్లు ఏమైనట్లు? ఎవరు మేసినట్లు?' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ను ఉద్దేశించి ప్రశ్నించారు. నవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో భాగంగా ముందస్తు ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నాలుగోసారి బీహార్కు వచ్చారు. మంగళవారం భగల్పూర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.



'భగల్పూర్ నుంచి నేను సవాల్ విసురుతున్నా.. నా పదవీకాలం ముగిసేలోగా ఐదేళ్లలో ఏయే పనికి ఎంతెంత ఖర్చుచేశామో పైసాతో సహా లెక్క చూపుతాం. అదే పనిని  ప్రస్తుత బీహార్ ప్రభుత్వం చెయ్యగలదా? కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద మొత్తానికి ఇక్కడి పాలకులు లెక్కలు చూపడంలేదు. అంటే ఏమిటి అర్థం? ఆ డబ్బు ఎవరు మేశారు?' అని మోదీ ప్రశ్నించారు.



జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా గత ఆదివారం పాట్నాలో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీని ప్రస్తావిస్తూ.. తమను తాము జయప్రకాశ్ నారాయణ్ అనుచరులుగా ప్రకటించుకునే నితీశ్, లాలూలు కాంగ్రెస్ పార్టీతో కలిసి వేదిక పంచుకోవడం ఆ మహానుభావుడిని అవమానించినట్లేనని ప్రధాని అన్నారు. 'ఇప్పటివరకు విదేశాల్లో లేదా ఎన్డీఏ నిర్వహించే సభల్లో మాత్రమే 'మోదీ.. మోదీ..' నినాదాలు విన్నాను. ప్రస్తుతం ఆ నినాదం బీహార్ అంతటా వినిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో విజయం కమలానిదేనని స్పష్టమవుతున్నది' అని మోదీ చమత్కరించిన మోదీ.. పాతికేళ్ల తర్వాత బీహారీలు తొలిసారిగా అభివృద్ధికి ఓటు వేయబోతున్నారన్నారు.



మోదీ వరుస బీహార్ పర్యటనలపై సీఎం నితీశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మోదీజీ.. మీ వాక్చాతుర్యాన్ని, ఛాతి విరుపులను, రోజుకో కొత్త వాగ్ధానాలను కట్టిపెట్టండి. బీహార్ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించండి. మీ కపట వాగ్ధానాలవల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించండి' అంటూ ట్వీట్ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top