'శంకుస్థాపనకు ప్రధాని వస్తానన్నారు'

'శంకుస్థాపనకు ప్రధాని వస్తానన్నారు' - Sakshi


ఈనెల 22న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్‌నూ ఆహ్వానించా: సీఎం

సాక్షి, న్యూఢిల్లీ: రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అదే రోజు తిరుపతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు తిరుమలేశుని దర్శించుకుంటారని చెప్పారు. శంకుస్థాపన ముహూర్తం మధ్యాహ్నం 12.35 నుంచి 12.45 మధ్య ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్వితీయమైన బ్లూ, గ్రీన్ (నీళ్లు, పచ్చదనంతో కూడిన) ప్రజా రాజధానిని నిర్మిస్తామని సీఎం అన్నారు. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలకడంతో పాటు రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్‌తో మాట్లాడి విభజన చట్టంలోని అంశాలు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

 

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అనంతరం ఏపీ భవన్‌లో కేంద్ర మంత్రులు పి.అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి విదేశీ నగరాల్లో పర్యటించి అధ్యయనం చేయాలని ప్రధాని సూచించినట్లు బాబు తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేస్తామన్నారు. చందాలు స్వీకరించడంతో పాటు ఏ విధంగా ప్రజలను భాగస్వాములు చేయాలనేదానిపై ఆలోచిస్తామని చెప్పారు. 2018 నాటికి రాజధాని నిర్మాణం మొదటి విడత పనులు పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సాగరమాల ప్రాజెక్టు అమలుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. అంతర్గత జల రవాణా (ఇన్‌లాండ్ వాటర్ వేస్) పై సమీక్ష చేశామన్నారు. ఏపీలో ఇన్‌లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టుకు రూ.1,800 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వ్యయం అవనుందన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కూడా రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించినట్టు బాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గవర్నర్ లేకుండా కార్యక్రమం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. శబరి బ్లాక్‌లో నరసింహన్‌తో బాబు భేటీ అయ్యారు.

 

జర్నలిస్టుల అసోసియేషన్‌పై వరాల జల్లు


 ఆంధ్రా జర్నలిస్టుల అసోసియేషన్ (ఢిల్లీ)పై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సోమవారం అసోసియేషన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు .. కార్పస్ ఫండ్ కింద రూ.5 లక్షలు మంజూరు చేయడంతో పాటు ఏపీ భవన్‌లో ఒక గది కేటాయిస్తూ అధికారులకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో పనిచేస్తున్న విలేకరులకు వారి సొంత జిల్లాల్లో స్థలాలు ఇవ్వడానికి కలెక్టర్లను ఆదేశాలిస్తామన్నారు. ఏపీభవన్‌లోని గురజాడ హాల్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఫొటోలపై వివాదం చోటు చేసుకుంది. ఆంధ్రా జర్నలిస్టుల అసోసియేషన్ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ ఫోటోను తొలగించి ఒక్క బాబు ఫోటోను పెట్టడం వివాదాస్పదమైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top