‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు

‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు - Sakshi


రెయిన్‌ గన్‌ల నిర్వహణ పేరుతో స్వాహాకు రంగం సిద్ధం



సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడా ఒక్క ఎకరం పంటను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం.. రెయిన్‌ గన్‌ల నిర్వహణ పేరుతో తాజాగా మరో భారీ దోపిడీకి తెర తీసింది. రెయిన్‌గన్‌ల నిర్వహణ, రబ్బర్లు, ట్యూబుల కోసమంటూ రూ.103 కోట్లు విడుదల చేసింది. చిన్న చిన్న పరికరాల మరమ్మతుల పేరుతో భారీగా నిధులు గత ఏడాది జూలై 9న రాసిన లేఖకు ఈ ఏడాది జనవరి 31న ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర విపత్తుల విభాగం ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేసింది.



సూక్ష్మ నీటి పారుదల పరికరాల సంస్థల సాంకేతిక సిబ్బందికి, స్పింకర్లు, ఆయిల్‌ ఇంజన్లు, పంపులు, గుర్తించిన కరవు పీడిత గ్రామాల్లోని పొలాలకు నీటిని తోలే ట్రక్కుల నిర్వహణకు ఈ నిధులు వాడుకోవచ్చు. ట్రాక్టర్ల అద్దె, పైపులకు అవసరమైన రబ్బర్‌ వాషర్లు, క్లాంపులు, తాళ్లు, మోకులు, పని ముట్లు, ఇంజిన్‌ ఆయిల్, తదితర వస్తువుల కోసం కూడా ఈ నిధులు వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ రెయిన్‌గన్‌లు, పరికరాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయో వ్యవసాయ శాఖ అధికారులకే సరిగా తెలియదు. అలాంటి వాటి నిర్వహణకు ఈ నిధులు కేటాయించడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి ప్రజా ధనాన్ని దోచిపెట్టడానికేనని రైతు సంఘాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి.



ఏ గన్ను ఎక్కడుందో తెలీదు..

గత ఖరీఫ్‌లో కరువులో చిక్కుకున్న పది లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 13,650కి పైగా రెయిన్‌గన్‌లను రూ.163 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇచ్చింది. కొనుక్కుంటా మన్న రైతులకు సబ్సిడీపై సరఫరా చేసింది. ఎకరాకు నీటిని పిచికారి చేసేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని ఖరారు చేసింది. ఇందులో సగం అంటే రూ.1,500లను సబ్సిడీగా ప్రకటించింది. ఇప్పుడవి ఎక్కడు న్నాయో తెలియదు. సీఎం చేసిన హడా వుడి తర్వాత రెయిన్‌గన్‌ల ఆచూకీ లేకుండా పోయింది. కొన్ని రైతుల వద్ద ఉండి పోగా, మ రికొన్ని వ్యవసాయ శాఖ వద్ద.. ఇంకొన్ని గిడ్డం గుల్లో, ఆ శాఖ కార్యా లయాల్లో పోగుపడ్డాయి. ఏ గన్ను ఎక్కడుందో తెలియ కుండా సిబ్బందిని నియమిస్తామనడం విడ్డూరం.



ఎవరి కోసం.. ఎందు కోసమంటే..

కోర్టు కేసులు, పరస్పర ఆరోపణలు, లోకాయుక్తాలో ఫిర్యాదుల అనంతరం అప్పట్లో రెయిన్‌గన్‌లు తెరపైకి వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండరు ఏపీకి చెందిన ఓ సంస్థకు దక్కాల్సి ఉండగా సూక్ష్మ నీటి పారుదల విభాగంలో కీలక వ్యక్తి చక్రం తిప్పి మహారాష్ట్ర సంస్థకు దక్కేలా చేశారు. దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందని, భారీగా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత.. ఆ రెయిన్‌గన్‌ల వల్ల ఎక్కడా పంట చేతికందకపోయినా.. నిర్వహణ ఖర్చంటూ ఇపుడు మైక్రో ఇరిగేషన్‌ సంస్థలకు ఈ నిధుల్ని కట్టబెట్టి తద్వారా ముడుపులు తీసుకునేందుకేనని రైతులు ఆరోపిస్తున్నారు. కింది నుంచి పై వరకు అందరూ అంతో ఇంతో పంచుకునేందుకే ఈ నిధుల మంజూరు అని ఓ ప్రముఖ రైతు నాయకుడు పేర్కొన్నారు.



4 లక్షల ఎకరాల్ని కాపాడారా?

రెయిన్‌ గన్‌లతో 4 లక్షల ఎకరాల్లో పంటల్ని.. ప్రత్యేకించి వేరుశనగను కాపాడామని సాక్షాత్తు సీఎం చెబితే వంతపాడడంలో ముందుండే రాష్ట్ర సమాచార మంత్రి 7 లక్షల ఎకరాలంటూ పల్లవి అందుకున్నారు. ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్ని లక్షల ట్రాక్టర్లు కావాలో, ఎన్ని లక్షల ట్యాంకర్లు కావాలో, ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు కావాలో కూడా యోచించకుండా అర్థం పర్థం లేని వాదనలు చేశారు. పూటకో మాట చెప్పి ప్రజల్ని తప్పు దోవ పట్టించినా ఎక్కడా ఒక్క ఎకరం కాపాడలేకపోయారన్నది నగ్నసత్యం. రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టు 28 నాటికి 309 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.



లక్షలాది ఎకరాల్లో మెట్ట పంటలు వాడుముఖం పట్టాయి. దీనిపై అంతకు ముందెన్నడూ దృష్టి సారించని ముఖ్యమంత్రి.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా పంట ఎండిన తర్వాత రెయిన్‌గన్‌లంటూ హడావుడి చేశారు. కరవును జయించామని ప్రకటించారు. వేరుశనగ పూత.. పిందె దశలో ఉన్నప్పుడు ఎకరానికి కనీసం 25 మిల్లీమీటర్ల మేర వర్షం (నీళ్లు) కావాలి. జూలై 15 నుంచి ఆగస్టు 28 వరకు వర్షం లేక కాయ ఊరడం ఆగిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. రెయిన్‌గన్‌లతో రక్షిత తడి కల్పించినా అది 5 – 6 మిల్లీమీటర్లకు మించలేదు.



20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడివో చెప్పండి?

ఎకరంలో పంటను కాపాడేందుకు నాలుగు పదున్లు అసవరమవుతాయి. ఒక పదును అంటే  25 మిల్లీమీటర్ల వర్షం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెయిన్‌గన్‌లతో ఇచ్చిన నీళ్లు కేవలం 5 మిల్లీమీటర్ల మేర మాత్రమే. అంటే కళ్లాపి జల్లినట్టు అన్నమాట. వాస్తవానికి ఇది అసంబద్ధం. ఈ నీళ్లతో పంటను బతికించుకోలేం. ఈ లెక్కన 5 మిల్లీమీటర్ల వర్షం మేర నీళ్లివ్వాలనుకుంటే ఒక్కో ఎకరాకు 25 వేల లీటర్లు కావాలి. ఒక ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ద్వారా అత్యధికంగా 5 వేల లీటర్లు సరఫరా చేశారనుకున్నా 25 వేల లీటర్ల సరఫరాకు 5 ట్రాక్టర్లు కావాలి. అదే లక్ష ఎకరాలకైతే 5 లక్షల ట్రాక్టర్లు కావాలి. ముఖ్యమంత్రి చెప్పినట్టు 4 లక్షల ఎకరా>లకైతే 20 లక్షల ట్రాక్టర్లు కావాలి. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్రాక్టర్లు ఉండవు. అయినా ముఖ్యమంత్రి మాత్రం 4 లక్షల ఎకరాలకు రెయిన్‌గన్‌ల ద్వారా నీరిచ్చి కరవును జయించామని పదే పదే టముకు వేస్తున్నారు.



ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కల ప్రకారం లక్ష ఎకరాలకైతే 250 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఆ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా వానలు పడలేదు. ఏ చేలోనూ పంట కుంటలు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చినట్టు? ఈ నీటి సరఫరాకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు వారం నుంచి పది రోజులు. ఈ గడువు లోపల 20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ఎవరికీ అంతుబట్టని విషయం. మరో మాటలో చెప్పాలంటే కరువును జయించామంటున్న ముఖ్యమంత్రికే తెలియాలి. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రెయిన్‌గన్‌లతో కాపాడామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా నిర్వహణకు రూ.103.5 కోట్లను విడుదల చేశారంటే దీని వెనకున్న నిగూడార్ధం ముడుపులేనని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది.



రెయిన్‌ గన్స్‌ అంటే...

బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే ఇదీనూ. నిజానికిదో సూక్ష్మ నీటి పారుదల పరికరం. తక్కువ నీటిని ఎక్కువ ప్రాంతానికి విరజిమ్మవచ్చు. ఆరడుల ఎత్తున ఓ రెయిన్‌గన్‌ను అమర్చితే దాని చుట్టుపక్కల సుమారు 45 మీటర్ల వరకు నీటిని విరజిమ్మ వచ్చు. 45 సెంట్ల పొలాన్ని తడిపేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. 5 హెచ్‌పీ ఇంజిన్‌ కావాలి. ఇందుకోసం ప్రతి రెయిన్‌ గన్‌కు ఒకటి చొప్పున రూ.23 కోట్లతో ఆయిల్‌ ఇంజన్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీళ్లున్న చోటు నుంచి రెయిన్‌ గన్‌ వరకు సరఫరా చేసేందుకు హెచ్‌డీపీఇ, క్యూపీసీ పైపులను ఉపయోగిస్తారు. ఏ పంటకు నీళ్లు చల్లుతున్నామనే దాన్ని అనుసరించి రెయిన్‌ గన్‌ స్టాండ్లను అమర్చుతారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి వంటి వాటికైతే రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్‌లు అమర్చి వాటికి రెయిన్‌గన్లను పెట్టి నీటిని పిచికారి చేస్తారు. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి.



‘తుక్కు’గన్‌లు!

రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రెయిన్‌గన్‌లు, డీజిల్‌ ఇంజన్లు, స్ప్రింక్లర్‌ సెట్లు, పైపులను అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన రైతులు తుక్కు కింద అమ్మేసుకుంటున్నారు. గత ఖరీఫ్‌ లో వాటిని దక్కించుకున్న వారిలో 80 మంది టీడీపీ సానుభూతిపరుతే. మళ్లీ వ్యవసాయ శాఖకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ‘ప్రభుత్వం మాది.. ఆ పరిక రాలు కూడా మావే’ అని తేల్చి చెబుతు న్నారు. మరికొందరు పాత పరికరాలను అప్పగిస్తున్నారు. అప్పట్లో సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా పరికరాలను సరఫరా చేయడంతో రికార్డుల్లో వివరాలు సరిగా లేవు.



మాకు పరికరాలు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయా? మా సంతకాలు చూపించండి? అని రైతులు ప్రశ్నిస్తుండ టంతో అధికారులకు దిక్కుతోచడం లేదు.   కొన్నిచోట్ల రెయిన్‌ గన్‌లు చోరీకి గురయ్యాయి. పంపిణీ చేసిన పరికరా లకు లెక్క తేలలేదని.. సగం పరికరాలు అందవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి పరికరాలను తిరిగి రాబట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసా య శాఖల అధికారులతో కమిటీని నియమించినా ఫలితం లేదు. ‘ప్రభుత్వం రైతులకు సరఫరా చేసిన రెయిన్‌గన్‌లను వారి నుంచి తిరిగి సేకరించే బాధ్యత ఆయా జిల్లా అధికారులదే. ఏ జిల్లాల్లో ఎంతవరకు రైతుల నుంచి రాబట్టారో మాకు తెలియదు. రూ.86 కోట్ల విలువైన రెయిన్‌గన్‌లను మేము సరఫరా చేశాం’ అని ఏపీ ఎంఐపీ ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top