అయలాన్ లాంటి ఇంకెందరో..

అయలాన్ లాంటి ఇంకెందరో..


దే ఆర్ టూ యంగ్ టు వోట్.. బట్ టూ ఓల్డ్ టు డై.. ( ఇంకా ఓటు హక్కు కూడా రాని ప్రాయం కాని చనిపోయే వయసు వచ్చేసింది)



వియత్నాం : ఫాన్ థి కిమ్ పుచ్, 1972

గాజాస్ట్రిప్ : ముహమ్మద్ అల్ దుర్రా, 2000

టర్కీ : అయలాన్ కుర్దీ, 2015




ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న యుద్ధాల్లో, అంతర్యుద్ధాల్లో తమ ప్రమేయం లేకుండా బలైన, బలౌతున్నపసికూనలకు ప్రతినిధులు. సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉండొచ్చు.. ఉంటుంది కూడా.. వీళ్లు కరుడు కట్టిన నేరస్తులు కాదు.. అవకాశాలుంటే అందరూ పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ స్కూళ్లకి వెళుతూ, అమ్మ ఒడిలో సేదతీరుతూ, నాన్న భుజాలపై ఆడుకుంటూ సరదాగా గడిపేయాలనుకునే చిరుకోరిక ఉన్నావారే.. శైశవ గీతాలు పాడుకోవాల్సిన వయసులో శవాలుగా మారుతుంటే.. మనసున్న ప్రతి గుండె కన్నీరు పెడుతుంటే.. సభ్యసమాజం సిగ్గుతో బాధతో తలదించుకుంటే కారణాలు, పరిష్కారాలు వెతకాల్సిన సమయంలో.. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకొని ఇలాంటి పరిస్థితుల్లో కొలాటరల్ డామేజీగానే పరిగణిస్తే, పసికూనలు శవాల గుట్టలుగా పడితే ఇంతకన్నా  'హ్యుమనిటేరియన్ క్రైసిస్' ఏముంటుంది.



1972, 2000, 2015.. తేడా ఏమీ లేదు... అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పసికూనలే సమిధలు.. ఈ మూడు ఘటనలు కెమరా కంటికి యాదృచ్ఛికంగా చిక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. కెమెరా కంటికి చిక్కని ఇలాంటి సంఘటనలు వేనవేలు.



నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా  కాలిన గాయాలతో బట్టలు విప్పేసి నగ్నంగా నడిరోడ్డు పై ప్రాణభయంతో పరుగెడుతున్న వియత్నాం బాలిక ఫాన్ ది కిమ్ ఫుట్ ఫోటో ఇప్పటికీ యుద్ధోన్మాదుల భయంకర క్రీనీడని గుర్తుకు తెస్తుంది. ఒకరకంగా అమెరికా వియత్నాం యుద్ధాన్ని విరమించి తోకముడవటానికి  నిక్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఈ సజీవ చిత్రం ప్రధాన కారణం. అంతర్జాతీయంగా గగ్గోలు, సభ్యసమాజం విమర్శలు, తొమ్మిది సంవత్సరాల కిమ్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆపన్న హస్తాలు. అదృష్టవశాత్తు కిమ్ బతికి బట్టకట్టింది. ఇప్పుడ కెనాడాలో ఉంటోంది. యుద్ధాల్లో పసికూనలు ఎలా బాధితులవుతున్నారో ప్రపంచానికి చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పింది కిమ్ ఫోటో..



కిమ్ లాంటి ఆ చిన్నపాటి అదృష్టానికి కూడా నోచుకోలేదు ముహమ్మద్ అల్ దుర్రా.. అతడు చేసిన నేరం ఏమీ లేదు. అయినా 12 సంవత్సరాల పసికూన ఏ నేరం చేయగలడు. తండ్రి జమాల్ తో కలిసి గాజాస్ట్రిప్ లో నడుచుకుంటూ వెళ్లడం, యాదృచ్ఛికంగా ఫ్రెంచ్ టెలివిజన్ ఒకటి ఆ సమయంలో అక్కడ ఉండటం ముహమ్మద్ ఎలా చనిపోయాడో ప్రపంచానికి తెలిసేట్టు నివ్వెరపోయేట్టు చేసింది సెప్టెంబర్ 2000లో జరిగిన ఈ సంఘటన.



కాల్చొద్దు అంటూ బతిమాలుతున్న జమాల్, ప్రాణభయంతో కొడుకును పొదుముకొని బుల్లెట్లు తగలకుండా దాక్కునే ప్రయత్నం.. వెంట వెంటనే నేరుగా కాల్పులు, గాయపడిన తండ్రి ఒడిలో నిర్జీవంగా ఉన్న ముహమ్మద్.. ఇక్కడ చర్చ పాలస్తీనా, ఇజ్రాయిల్ గొడవ కాదు. 12 సంవత్సరాల ముహమ్మద్ ఏం నేరం చేశాడని. ఈ ఉదంతం  మరో ఐదు సంవత్సరాల పాటు పాలస్తీనా, ఇజ్రాయిల్ ల మధ్య తీవ్ర యుద్ధానికి, ప్రాణ నష్టానికి దారి తీసింది.



2015 సెప్టెంబర్ : టర్కీ సముద్ర తీరంలో మూడంటే మూడు సంవత్సరాల అయలన్ కుర్దీ శవం.. ఇసుకలో బోర్లాపడి.. ఎర్రటి చొక్కా, బ్లూకలర్ నిక్కర్, షూ.. అమాయకమైన మొహం.. ఎంత దారుణం. సిరియాలోని కొబాని పట్టాణాన్ని ఐఎస్ఐఎస్ మూకలు ధ్వంసం  చేసిన తర్వాత ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని... అక్కడినుండి వందల కిలోమీటర్లు టర్కీ గుండా ప్రయాణం.. గ్రీస్ లోని ఒక దీవికి చేరుకొని అక్కడి నుండి ఎలాగో అలాగా కెనడా చేరుకోవాలని, పిల్లలకి భయం లేని జీవితాన్ని ఇవ్వాలని అయలన్ తండ్రి ఆరాటం.. మూడు సంవత్సరాల అయలన్ కు తెలిసినవి రెండే రెండు. ఒకటి భయం. రెండు పరుగు.. టర్కీ గ్రీస్ మధ్య సముద్రంలో ఆ పరుగు ఆగిపోయింది. కాని శరణార్ధుల జీవితాల్ని, యూరప్ దేశాల మొండి వైఖరిని ప్రపంచానికి అయలాన్ మరొకసారి చాటి చెప్పాడు..తన చావుతో...



ఈ మూడు సంఘటనలు దాదాపు 50 సంవత్సరాల వ్యవధిలో జరిగాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయిందట.. కానీ పసికూనల సామ్రాజ్యం కుంచించుకుపోయింది.. యుద్ధాల్లో, అంతర్యుద్ధాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు.



కొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలలో మొన్నమొన్నటి వరకు పక్కన ఉన్న శ్రీలంకలో 10,12 సంవత్సరాల పిల్లలు ఏకే 47లు పట్టుకొని, ఇతరులను చంపి, తాము చస్తున్న ఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. పసికూనలు ఆత్మాహుతి దళ సభ్యులవుతున్నారు. వీరి చావులకు లెక్కే లేదు.. లెక్కలు లేవు.



ఎక్కడో ఎందుకు.. మన దగ్గరే. వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న రోజుల్లో ఓటు హక్కు వయసు కూడా లేని ఎంతో మంది నక్సలైట్లు ఎన్కౌంటరయ్యారు.



ఎగురుకుంటూ వచ్చే నోట్ల కట్టలకు ఎర్రతివాచీలు స్వాగతం పలికే 'గ్లోబల్ విలేజ్' లో కంప్యూటర్లే మాట్లాడుకుంటాయి. ' సాఫ్ట్వేర్', హార్డ్వేర్ భాషలో.. అరచేతిలో ప్రాణలు పెట్టుకొని బతకాలనే ఆశతో పరుగులు పెట్టే అయలాన్ లాంటి వారికి తుపాకులు అడ్డం పడతాయి.. ముళ్ల కంచెలు శరీరాన్ని చీరేస్తాయి. బారికేడ్లు బంధిస్తాయి.. వేటకుక్కలు తరిమేస్తాయి.. సముద్రమైనా కాపాడుతుందనుకుంటే మింగేసిన కడలి అలలతో ఒడ్డుకు నెట్టేస్తుంది. అలా ఒడ్డున దీనంగా దిక్కులేని శవంగా అయలాన్ అలాంటి ఇంకెందరో..' హ్యుమానిటీ' లేనపుడు ఇక హ్యుమనిటేరియన్ క్రైసిస్ కి అర్ధమెక్కడుంది.



ఎస్.గోపినాథ్ రెడ్డి

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top