తగ్గిన పెట్రో ధరలు

తగ్గిన పెట్రో ధరలు


న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనమవడంతోపాటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కాస్త పెరగడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.41 చొప్పున, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.25 చొప్పున ధరలను తగ్గించాయి. వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పన్నులు లేదా వ్యాట్‌లో తేడాల కారణంగా ఈ ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. సవరించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు మరో 10-15 పైసలు తగ్గాల్సినప్పటికీ పెట్రోల్‌పంప్ డీలర్లకు చెల్లించే కమీషన్‌ను చమురు సంస్థలు ఆ మేరకు పెంచింది.


 


ధరల తాజా తగ్గింపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 66.65 నుంచి రూ. 64.25కి చేరుకుంది. హైదరాబాద్‌లో రూ. 72.83 నుంచి రూ. 70.42కు తగ్గింది. డీజిల్ హైదరాబాద్‌లో రూ. 60.60 నుంచి రూ. 58.35కు చేరుకుంది. ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి కాగా డీజిల్ ధరలు అక్టోబర్‌లో తగ్గడం రెండోసారి.

 

 

 మొత్తంమీద ఆగస్టు నుంచి పెట్రోల్ ధర లీటర్‌కు దాదాపు రూ. 9.36 చొప్పున తగ్గింది. పెట్రోల్ ధరల తరహాలోనే డీజిల్ ధరలపైనా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 18న నియంత్రణను ఎత్తేసి మార్కెట్ ధరకు అనుగుణంగా డీజిల్‌ను విక్రయించుకునేందుకు చమురు సంస్థలకు స్వేచ్ఛనివ్వడం తెలిసిందే. దీంతో ఐదేళ్ల వ్యవధిలో తొలిసారిగా అక్టోబర్ 18న డీజిల్ ధరను లీటర్‌కు రూ. 3.37 చొప్పున చమురు సంస్థలు తగ్గించాయి. మరోవైపు సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటా దాటాక వినియోగదారులు కొనుగోలు చేసేవి) వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 18.50 తగ్గించాయి. దీంతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 865కి చేరింది. ఆగస్టు నుంచి సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది నాలుగోసారి. కాగా, ఢిల్లీలో సీఎన్‌జీ ధరను మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కేజీకి రూ. 4.50 చొప్పున పెంచింది. అలాగే డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరను ఎస్‌సీఎంకు రూ. 2.49 పెంచింది. దీంతో సీఎన్‌జీ ధర రూ. 43.45కి పెరగగా పీఎన్‌జీ ధర రూ. 26.58కి పెరిగింది. కాగా, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదేనని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధరను ఆరుసార్లు, డీజిల్ ధరను రెండుసార్లు తగ్గించామన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top