జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌?!

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌?!

  • ఆర్థిక శాఖను కోరిన ఇంధనశాఖ

  • జీఎస్టీలోకి వస్తే రాష్ట్రాలకు భారీగా నష్టం

  • జీఎస్టీలో అత్యధిక స్లాబ్‌ 28 శాతం

  • అమల్లోకి వస్తే వినియోగదారుడికి ఊరట

  • లీటర్‌ ధర రూ. 40 లోపే



  • పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తారని వాదన రెండు మూడువారాలుగా హల్‌చల్‌ చేస్తోంది. ఇది సాధ్యమేనని కొందరు.. అసాధ్యమని మరికొందరు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణులు కూడా బేధాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



    దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రో ధరలు.. మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రోజువారీ మారే పెట్రోధరలతో సామాన్య వినియోగదారుడి నడ్డి విరుగుతోంది. కంటికి కనిపించకుండానే ధరలు అమాంతం ఆకాశానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దీపావళికి శుభవార్త వింటారంటూ.. ప్రకటించారు. పెట్రో, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారా? అన్న ఆశను ఈ ప్రకటన మరింత పెంచుతోంది.


    దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. వివిధ రకాల వ్యాట్‌, ఇతర పన్నులు ఉండడంతో ఇంధన ధరలు భారీగా ఉంటున్నాయి. అందువల్ల పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇంధనశాఖ ఆర్థిక శాఖను కోరింది. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెట్రో, డీజిల్‌ను జీఎస్టీలోరి చేర్చేందుకు అందరూ అంగీకరిస్తారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


    ప్రస్తుత పరిస్థితి

    ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వినియోగదారుడు పలు రకాల పన్నులు చెల్లిస్తున్నాడు. అందులో ప్రధానంగా..  ఎక్సైజ్‌ పన్ను (దీనిని కేంద్రం విధిస్తుంది), ఇక విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను ఆయా రాష్ట్రాలు డీలర్‌ కమీషన్‌తో కలిపి ఆయా రాష్ట్రాలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో సెప్టెంబర్‌ 13 నాటిపెట్రోధరలను పరిశీలిస్తే.. లీటర్‌ పెట్రోల్‌ ధర 70.38 రూపాయలు. అందులో కేంద్రం విధించే ఎక్సైజ్‌ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, అందులో వ్యాట్ రూ. 14.96 కాగా, డీలర్‌ కమీషన్‌ రూ.3.24, వాస్తవంగా పెట్రోల్‌ ధర వచ్చి 30.70 రూపాయలు.. అన్ని రకాల పన్నులతో కలిపి లీటర్‌ పెట్రోల్‌ రూ.70.38కి చేరింది.


    జీఎస్టీలోకి వస్తే..!?

    పెట్రో ఉత్పత్తులు గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ పరిధిలోకి వస్తే.. వ్యాట్, ఎక్సైజ్‌ పన్నులు కలిసిపోయి ఒకే ట్యాక్స్‌ స్లాబ్‌లోకి చేరుతుంది. ప్రస్తుతం జీఎస్టీలో అత్యధిక పన్ను స్లాబ్‌ 28 శాతం. ఈ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ చేరినా.. ధరలు మాత్రం భారీగా తగ్గుతాయి. అంటే లీటర్ పెట్రోల్‌ ధర 40 లోపుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


    రాష్ట్రాలకు నష్టం

    జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను చేర్చడం మంచిది కాదని కొందురు ఆర్థిక మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్రో ధరలు తగ్గించేందుకు ఇదే సరైన పరిష్కారం కాదని కూడా వారు అంటున్నారు. పెట్రోల్‌ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచి పరిణామం కాదని అంటున్నారు. ఇదే నిజంగా వాస్తవ రూపం దాల్చితే.. రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో భారీగా కోతపడుతుంది. గణాంకాల పరంగా చూస్తే.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ అమ్మకంపై 27 శాతం ఆదాయం వస్తుంది. ఇదే జీఎస్టీ పరిధిలోకి 28 స్తాబ్‌ రేట్‌తో వచ్చినా 14 శాతం ఆదాయం మాత్రమే.. ఎస్జీఎస్టీతో వస్తుంది. ఆ ప్రకారం కేవలం రూ. 4.29 రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి లభిస్తుంది.  



    ఆర్థిక శాఖ నిర్ణయం ఎటు?

    పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకీ తీసుకురావాలన్ని ఇంధనశాఖ విన్నపాన్ని ఆర్థికశాఖ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువాలని జీఎస్టీ కౌన్సెల్‌ తీర్మానం చేస్తే... ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ స్లాబ్స్‌ ఆ లోటును భర్తీ చేసే అవకాశం లేదు. దీంతో జీఎస్టీ కౌన్సెల్‌ ఆ లోటను భర్తీ చేసేందుకు ఇంధనంపై అదనంగా కొన్ని పన్నులను విధించే అవకాశం ఉంది.


    ఏదిఏమైనా దీపావళికి ఇంధన ధరలు దిగి వస్తాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన ప్రకటన వాస్తమైతే.. సామాన్యుడికి నిజంగా దీపావళి పండుగేనని చెప్పాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top