మహాప్రస్థానం

మహాప్రస్థానం - Sakshi


విశ్వ గురువుకు తుది వీడ్కోలు

 సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు

 ప్రధాని మోదీ సహా పలువురి రాక

 జనసంద్రమైన రామేశ్వరం

 

 సాక్షి ప్రతినిధి, రామేశ్వరం: ఆజీవన పర్యంతం అవిశ్రాంతంగా పనిచేసిన విశ్వగురువు శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయాడు. మిసైల్ మ్యాన్ తన శరీరాన్ని భూ ఒడిలో నిద్రపుచ్చి అంతరిక్షంలోకి దూసుకుపోయాడు. వేనవేలుగా తరలివచ్చిన అశేష ప్రజానీకం కన్నీటి అభిషేకం మధ్యన.. ‘భారత్‌మాతాకీ జై.. కలాంసర్’ అంటూ పెక్కుటిల్లిన నినాదాల నడుమ దేశ క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం సమస్త సైనిక అధికార లాంఛనాలతో  పూర్తయ్యాయి. తన సొంత పట్టణం రామేశ్వరంలోని ెపేక్కరుంబు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 1.5 ఎకరాల భూమి మధ్యలో కలాం పార్థివ దేహాన్ని ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. జూలై 27న షిల్లాంగ్‌లో ఐఐఎం విద్యార్థుల ముందు ప్రసంగం చేస్తూ గుండెపోటుతో తనువు చాలించిన 83 సంవత్సరాల క్షిపణి మాంత్రికుడి ఉత్తరక్రియలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటలకు కలాం భౌతిక కాయాన్ని ముగైద్దీన్ ఆండవర్ మసీదుకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు పూర్తిచేశారు. మసీదులోని ఆలిన్(ప్రధాన పూజారి) ‘‘నమాజ్ ఏ జనజా’’ను పఠించారు. అక్కడి నుంచి సైనిక వాహనంలో ఊరేగింపుగా 10.30 గంటలకు పేక్కరుంబు గ్రామంలోని అంత్యక్రియల ప్రాంగణానికి చేర్చారు. మార్గమధ్యమంతా ప్రజలు పెద్ద ఎత్తున ‘భారత్‌మాతాకీ జై, కలాంసర్’ అంటూ నినదించారు.

 

 ప్రముఖుల నివాళి..

 

 ప్రధాని నరేంద్రమోదీ ముందుగా కలాం భౌతికకాయం వద్ద పుష్పవలయాన్ని ఉంచి సుమారు 5 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు.  ఆ తరువాత కలాం 99 ఏళ్ల అన్నయ్య మహమ్మద్ ముథు మీరన్ లెబ్బాయ్ మరైకర్ వద్దకు వెళ్లి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. త్రివిధ దళాధిపతులు,  కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్, పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, కేరళ గవర్నర్ సదాశివం, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్‌చాందీ, త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు. అలాగే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, చంద్రబాబు ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చందర్ శ్రద్ధాంజలి ఘటించినవారిలో ఉన్నారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యకారణాల వల్ల హాజరుకాకపోవడంతో ఆమె తరపున ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో ఏడుగురు మంత్రుల బృందం కలాం భౌతికకాయానికి నివాళులర్పించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో తదితరులు కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

 అధికార లాంఛనాలతో..

 

 ప్రముఖుల నివాళుల కార్యక్రమం ముగియగానే సరిగ్గా 11 గంటలకు కలాం పార్థివదేహంపై కప్పిఉన్న త్రివర్ణజాతీయ పతాకాన్ని త్రివిధ దళాల సైనికులు తొలగించి అంత్యక్రియల బాధ్యతను ఇస్లాం మతపెద్దలకు అప్పగించారు. 21 గన్ శాల్యూట్‌తో మాజీ సర్వసైన్యాధ్యక్షుడికి చివరి సైనిక వందనాన్ని సమర్పించారు. ఆ తరువాత మతపెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో మౌల్వీ ఎస్.ఎం.అబ్దుల్ రహమాన్, మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కలాం భౌతిక కాయానికి ఖనన కార్యక్రమం పూర్తి చేశారు. ఖనన కార్యక్రమంలో మత పెద్దలతోపాటు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ కూడా పాలుపంచుకున్నారు. ఆ తరువాత పెద్ద ఎత్తున పూలను కలాం సమాధిపై చల్లారు. అనంతరం మౌల్వీ సాహెబ్ నేతృత్వంలో సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగినంత వరకు ప్రధాని సహా హాజరైన నేతలంతా నిలుచుని వీక్షించారు.

 

 బారులు తీరిన జనసందోహం..

 

 మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలకు తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బస్సుల్లో, రైళ్లలోనే కాకుండా సముద్రమార్గంలో, బోట్లలో కూడా రావటం కలాంకు ఉన్న విశేషమైన ప్రజాదరణను ఇక్కడ ప్రతిఫలించింది. ‘కలాంసర్’  అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని జనవాహిని ఆయన అంతిమయాత్రలో పాల్గొంది. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతిమసంస్కారాలు జరిగే ప్రాంతానికి తాత్కాలిక రోడ్లను కూడా తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. రామకృష్ణమఠం, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజానీకానికి ఆహారం, నీరు అందించే ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం చుట్టూ సముద్ర తీరం వెంబడి పెద్ద ఎత్తున నౌకాదళాలను మోహరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా రాకపోవటంతో ఆమె ప్రతినిధిగా రాష్ట్ర ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం అంత్యక్రియల కార్యక్రమాలను పర్యవేక్షించారు. కలాంకు గౌరవ సూచకంగా తమిళనాడు ప్రభుత్వం గురువారం సెలవును ప్రకటించింది. రాష్ట్రమంతా దుకాణాలు, వివిధ సంస్థలు.. అన్నీ సెలవు పాటించాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కూడా కలాంకు ప్రజలు నివాళులు అర్పించారు. గురువారం కలాం అంత్యక్రియల నేపథ్యంలో సామాజిక వెబ్‌సైట్లయిన ఫేస్‌బుక్, ట్వీటర్ తదితర మాధ్యమాల్లో లక్షలాది అభిమానులు తమ నివాళులు అర్పించారు. ఉపగ్రహ వాహక పరిజ్ఞానం, క్షిపణి పరిజ్ఞానంతో పాటు, 1998 అణ్వస్త్ర పరీక్షల భాగస్వామిగా కలాం సేవలను కొనియాడారు. వివిధ సందర్భాల్లో కలాం చేసిన ప్రసంగాల్లోని కోట్స్ వేల సంఖ్యలో సామాజిక ఆన్‌లైన్ మాధ్యమాన్ని హోరెత్తించాయి.  



పేక్కరంబు గ్రౌండ్ లో కలాం సమాధిపై పూలు చల్లుతున్న  ముస్లిం మత పెద్దలు


 


 



గురువారం తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరైన ప్రజలు


 




కలాం అంత్యక్రియలకు ఆయన అన్న మహమ్మద్ ముత్తును తీసుకువస్తున్న దృశ్యం. చిత్రంలో కేంద్రమంత్రి వెంకయ్య తదితరులు


 



జై కలాం సార్ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top