మా డీఎన్‌ఏలోనే శాంతి, అహింస

మా డీఎన్‌ఏలోనే శాంతి, అహింస - Sakshi


టోక్యో: జపాన్ పర్యటనను అత్యంత విజయవంతమైన పర్యటనగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. జపాన్ హామీ ఇచ్చిన 3.5 ట్రిలియన్ డాలర్ల( రూ. 2.12 లక్షల కోట్లు)సాయంతో భారత్‌లో మౌలిక వసతుల కల్పన మెరగుపడుతుందని, దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చడం సాధ్యమవుతుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు నిధుల ద్వారా ఈ సాయం భారత్‌కు అందనుందని తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, గంగానదిని శుద్ధి చేయడం సహా పలు కార్యక్రమాల అమలుకు ఆ మొత్తాన్ని ఉపయోగిస్తామన్నారు. పర్యటనలో నాలుగో రోజు మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరగా జపాన్‌లోని భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చేసిన ప్రసంగంలో.. హెచ్‌ఏఎల్ సహా ఆరు భారతీయ కంపెనీలపై జపాన్ నిషేధం ఎత్తివేయడాన్ని ప్రస్తావస్తూ.. ‘జపాన్ మనపై విశ్వాసముంచడం నన్నెంతో సంతోషపరుస్తోంది’ అన్నారు.


 


జపాన్‌తో బంధం ధృఢమైనదని పేర్కొంటూ.. ‘ఇది ఫెవికాల్ బంధం కన్నా ధృఢమైనది’ అని చమత్కరించారు. శాంతి, అహింసలు భారతీయుల డీఎన్‌ఏలోనే ఉన్నాయని మోడీ స్పష్టం చేశారు. అది ఏ అంతర్జాతీయ ఒప్పందంకన్నా ఎక్కువేనన్నారు. సేక్రెడ్ హార్ట్స్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడంపై వివరణ ఇస్తూ మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఒక కుటంబమనే ‘వసుధైక కుటుంబం’ భావనను భారత్ విశ్వసిస్తుందన్నారు.

 

 మోడీ కార్యక్రమాల విశేషాలు, వ్యాఖ్యలు..

 

 జపాన్‌లోని స్మార్ట్ సిటీ క్యోటోకు, మన వారణాసికి చాలా పోలికలున్నాయి. రెండూ చిన్న పట్టణాలే. రెండు పట్టణాల్లోనే పెద్ద సంఖ్యలో దేవాలయాలున్నాయి. క్యోటో తరహాలో కాశిని కూడా స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం.

 

 పరిశుభ్రత మహాత్మాగాంధీకి చాలా ఇష్టమైన విషయం. అందుకే ఆయన 150వ జయంతి(2019) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చాలని ప్రతినబూనాం. అదే ఆయనకు మనమిచ్చే నివాళి.

 పాములోళ్ల దేశంగా భారత్‌ను కొందరు భావిస్తారు. అందుకే ‘గతంలో పాములతో ఆడుకున్నాం.. ఇప్పుడు మౌజ్(భారతీయుల ఐటీ సామర్ధ్యాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ)లతో ఆడుకుంటున్నాం’ అని నేను ఒకరితో చెప్పాను.

 

 21వ శతాబ్దం భారత్‌కో, చైనాకో, జపాన్‌కో చెందదు. అది ఆసియాకు చెందుతుంది.

 దేశాల మధ్య సంబంధాలు పెరగాలంటే.. ప్రజల మధ్య అనుబంధం పెరగాలి.

 ఇరుదేశాలు యువ ఎంపీల పార్లమెంటరీ సంఘాలను ఏర్పాటు చేయాలి. అలాగే, జపాన్ నుంచి వచ్చే పార్లమెంటేరియన్లు భారత్‌లో కేవలం ఢిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాలి.

 

 భారతీయ ఎంబసీలో వివేకానంద సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన మోడీకి భారీగా గుమికూడిన భారతీయ అభిమానులు స్వాగతం పలికారు. దాంతో భద్రత సిబ్బందిని కాదని మోడీ వారితో మమేకమయ్యారు. వారితో కరచాలనాలు చేసి, ఫోటోలు దిగారు.

 

 జపాన్ చక్రవర్తి అకిహితోతో భేటీ సందర్భంగా ఆయనకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. భగవద్గీతను బహుమతిగా ఇవ్వడంపై భారత్‌లోని లౌకికవాద మిత్రులు  తుపాను సృష్టిస్తారని, మీడియాలో చర్చలు ప్రారంభమవుతాయని హాస్యంగా వ్యాఖ్యానించారు.

 

 డ్రమ్మర్ మోడీ: జపాన్‌లో మోడీలోకి కొత్త కళ ఆవిష్కృతమైంది. డ్రమ్మర్‌గా కొత్త అవతారమెత్తి.. జపాన్  సంప్రదాయ డ్రమ్మర్లతో కలసి ‘జుగల్‌బందీ’ చేశారు. అక్కడ నిపుణులైన వాయిద్యకారులకు గట్టి పోటీనిచ్చారు. ‘టీసీఎస్ జపాన్ టెక్నాలజీ అండ్ కల్చరల్ అకాడెమీ’ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top