సినిమాలపై వ్యామోహాన్ని తగ్గించుకోండి: పవన్ కల్యాణ్

సినిమాలపై వ్యామోహాన్ని తగ్గించుకోండి: పవన్ కల్యాణ్ - Sakshi


తిరుపతి: సినిమాలకు, నిజజీవితానికి చాలా తేడా ఉంటుందని, సినిమాల్లో చూపేవన్నీ నిజంగా జరగవని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన.. సినిమాలపై వ్యామోహాన్ని తగ్గించుకోవాలని అభిమానులకు సూచించారు. అదే క్రమంలో ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ కర్తవ్యం, బీజేపీ, టీడీపీలతో సంబంధాలపై మాట్లాడారు. చిత్తూరు సహా పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ ఇలా మాట్లాడారు..



'రెండు గంటల సినిమాలో రౌడీలను కూలదోయొచ్చు, హీరోయిన్లతో ఆడొచ్చు. అన్యాయాల్ని ఎదుర్కోవచ్చు. కానీ నిజజీవితంలో అలా జరగదు. రామ్ దేవ బాబా 2మినిట్స్ నూడుల్స్ లా ఏ సమస్యా వెంటనే పరిష్కారం కాదు. అభిమానులందికీ మనవి.. సినిమాను వినోదంగానే చూడండి. సీరియస్ గా తీసుకోకండి. హీరోల గురించి మీరు కొట్టుకుంటారు. కానీ నిజజీవితంలో హీరోలు ఫ్రెండ్స్ గా ఉంటారు. మీరు సీరియస్ గా తీసుకోవాల్సింది సినిమాలను కాదు.. నిజజీవితాన్ని. నా అభిమాని వినోద్ హత్యకు గురవ్వడం బాధకలిగించింది. ఆ తల్లి గర్భశోకం నన్ను కలవరపెట్టింది. బిడ్డ హత్యకు గురైనప్పటికీ తన కొడుకు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చిన వినోద్ తల్లికి నా పాదాభివందనం. అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. రెండున్నర సంవత్సరాలుగా అన్ని సమస్యలపై మాట్లాడుతున్నా. అమరావతి రాజధాని భూముల రైతులకు అండగా మాట్లాడా.



 ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుటుంన్నా. ఇందుకు వేదికగా తిరుపతిని ఎంచుకోవడానికి కారణం.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులతో నా మొదటి రాజకీయ సభ తిరుపతిలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రశ్నిస్తున్నా. పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే నేను తొందరపడి మాట్లాడను. రాష్ట్రం విడిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచానో.. వాళ్లకు సలహాలు ఇస్తానే తప్ప విమర్శలు చేయడానికి ఇష్టపడను. చాలా మంది అంటున్నారు.. పవన్ కల్యాణ్్  జనసేన పెట్టింది మోదీ భజన చేయడానికని, తెలుగుదేశం తొత్తులా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంకొందరు గబ్బర్ కాదు రబ్బర్ అన్నారు. అన్నీ వింటున్నా.. నేను ఎక్కడికీ పారిపోను. మాట ఇచ్చానంటే వెనక్కి తగ్గే మనిషిని కాను. ఇచ్చిన మాట కోసం, ప్రశ్నించడం కోసం వెనకడుగు వేయను. నేను మోదీకో, చంద్రబాబు పక్షపాతినోకాదు. నేను రైతు పక్షపాతిని. ఆడబిడ్డల పక్షపాతిని. ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో దాసోహం కాను.



సీపీఐ నారాయణ నన్ను తీవ్రంగా విమర్శించారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని ఖండించగలను. కానీ అలా చేయలేదు ఎందుకంటే నాకు వామపక్ష భావజాలం అంటే ప్రేమ. మా నాన్నగారూ అదే భావజాన్ని నేర్పారు. తన దేశం కాకపోయినా పొరుగు దేశంలో మానవత్వం కోసం పోరాడిన చెగువెరా అన్నా నాకు ఇష్టం. అసలు సమస్య ఎక్కడొచ్చిందటే.. బీజేపీకి, టీడీపీకి భుజం కాశానని, నావల్ల వారికి లబ్ధిజరిగిందని అనుకుంటున్నారు. అయితే నేను చేసింది ఉడత సాయమే తప్ప మరొకటికాదు. రాజకీయాల్లో నా మొదటి అనుభవం.. నేను అన్నీ రిస్కులు ఎదుర్కొని పాలిటిక్స్ లోకి వచ్చా. నాకు ఎలాంటి కోరికా, వ్యామోహం లేదు. నరేంద్ర మోదీగారికి, తెలుగుదేశానికి సహాయసహకారాలు అందించినప్పుడు చాలామంది విమర్శించారు. ప్రభుత్వం తప్పుల్ని ఎత్తిచూపాను.



రైతు భూములపై తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే.. నాపై కుల ముద్ర పడిపోయింది. కానీ నాకు కులం లేదు.. మతం లేదు. నా కూతురు క్రిస్టియన్. నా భార్య తన రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి సంప్రదాయాల ప్రకారం పెంచుతోంది. నేను హిందూ ధర్మంలో పట్టాను. ఈ రెండింటితో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే నాకు కులం, మతం, ప్రాంతాలనే బేధాలు లేవు. నాది మానవత్వం. తెలుగుదేశాన్ని సమర్థించినప్పుడు గుర్తుకురాని కులం ప్రశ్నించినప్పుడే లేవనెత్తారే? అని అవి రాసిన వారిని అడిగాను. నాకు చేతనైతే చేస్తాను. కాకుంటే క్షమించమని అడుగుతాను. కానీ చెయ్యగలనని జనాన్ని మభ్యపెట్టను. మోదీగారు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు శుభాకాంక్షలు చెప్పా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన్ని కలవలేదు.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top