‘పట్టిసీమ’లో మరో మోసం

‘పట్టిసీమ’లో మరో మోసం - Sakshi


రూ. 260 కోట్లు కొట్టేయడానికి వ్యూహం

ఖర్చు తగ్గించుకోవడానికి డిజైన్ మార్చిన కాంట్రాక్టు సంస్థ

మోటార్లు ఆర్డర్ ఇచ్చి, పైపులైన్లు కూడా వేసిన తర్వాత ప్రతిపాదన

ఆమోదముద్ర వేసేందుకు సర్కారు సిద్ధం!

 


హైదరాబాద్: ‘యమలీల’ అని ఓ సినిమా ఉంది. అందులో హీరో ఆలీకి భవి ష్యత్ విషయాలు ముందే తెలిసిపోతుంటాయి. అలాగే పట్టిసీమ కాంట్రాక్టర్‌కు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందే తెలిసిపోతున్నాయా? తానేం చేసినా ప్రభుత్వం ఆమోదిస్తుందని ముందే తెలుసుకాబట్టే ఇష్టమొచ్చినట్టుగా ఎత్తిపోతల డిజైన్‌లో మార్పు చేశారా?  పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 30 మోటార్ పంపులు, 15 వరుసల పైపులైన్ ఏర్పాటు చేసి (రెండు మోటార్ పంపులకు ఒక పైపులైన్ చొప్పున) 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలని కాంట్రాక్టు సంస్థ మెగా, ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉంది. అయితే కాంట్రాక్టర్ మోటార్ పంపులను 24కు, పైపులైన్లను 12కు తగ్గించేశారు. దీనివల్ల పథకం మొత్తం అంచనా వ్యయం రూ.1,300 కోట్లలో కనీసం 20 శాతం  అంటే రూ.260 కోట్లు అప్పనంగా కొట్టేయవచ్చనేది కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దల వ్యూహమని నీటిపారుదల శాఖ వర్గాలంటున్నాయి. మోటార్ పంపుల సరఫరా కోసం కాంట్రాక్టర్ ఇప్పటికే చైనాకు ఆర్డర్ ఇచ్చారు. 4 వరుసల పైపులైన్లు వేయడం పూర్తి చేశారు.



ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అంటే మరో 18 రోజుల్లో పథకాన్ని ప్రారంభించడానికి వీలుగా పనులు ముగింపు దశకు రావలసిన సమయంలో.. మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్యను తగ్గించి, ఆ మేరకు డిజైన్‌లో మార్పు కోరుతూ ఈ నెల 27న కాంట్రాక్టర్ నుంచి సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు ప్రతిపాదన వచ్చింది. మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గితే వ్యయం కూడా ఆ మేరకు తగ్గడం సహజం. కానీ వ్యయం ఏమీ తగ్గదట. ఇదే విషయాన్ని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతేకాదు ఒప్పందానికి విరుద్ధంగా కాంట్రాక్టర్ పైపుల సైజును పెంచి నాలుగు వరుసలు వేసేశారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా డిజైన్ మార్పు ప్రతిపాదనపై ఆమోదముద్ర వే యడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. తన ఇష్ట ప్రకారం మార్చిన డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కాంట్రాక్టర్‌కు ముందే తెలిస్తే తప్ప ఇష్టారాజ్యంగా పనులు చేసేయడం సాధ్యం కాదని అంటున్నారు. ‘దోపిడీ వ్యూహం’ వెనుక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టే పైపుల వ్యాసం ఒప్పందంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఉన్నా.. పనులు పర్యవేక్షించిన అధికారులకు అది కనిపించలేదు. డిజైన్ మార్పుపై ఇటు కాంట్రాక్టర్‌కు, అటు ప్రభుత్వ పెద్దలకు అవగాహన ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 24 మోటార్లకే ఆర్డర్!

 మోటార్ పంపులను చైనాలో కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఆర్డర్ ఇచ్చింది. కేవలం 24 మోటార్ పంపులకే ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. మోటార్ పంపుల పనితీరు, సామర్థ్యం, మోడల్ తనిఖీ చేయడానికి వీలుగా అధికారుల బృందం చైనా వెళ్లడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఈనెల 17నే ఉత్తర్వులు (జీవో-472) ఇచ్చింది. వీటి సామర్థ్యం ఎంత? వాటి పనితీరు ఏమిటి? ఏ మోడల్ వి కొంటున్నారు?.. ఈ వివరాలు అధికారులకు ఇస్తే తప్ప పరిశీలన, తనిఖీ సాధ్యం కావు. అంటే ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చేటప్పటికే మోటార్ పంపుల అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. కాంట్రాక్టర్ 24 మోటార్ పంపులకే ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం ఎలా అనుమతించింది అన్నది ప్రశ్న. అలాగే డిజైన్ మార్పునకు ప్రభుత్వం అంగీకరించకముందే, మోటార్ పంపుల కొనుగోలుకు కాంట్రాక్టర్ ఎలా ఆర్డర్ ఇచ్చారనేది మరో ప్రశ్న. దీన్నిబట్టే తాము సమర్పించే ప్రతిపాదనకు ప్రభుత్వం తలాడిస్తుందని కాంట్రాక్టర్‌కు ముందే తెలుసనేది స్పష్టమవుతోంది.



 పైపుల సైజు 3.2 మీటర్లకు పెంపు

 ఒప్పందం ప్రకారం 3 మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 15 వరుసలు వేయాలి. పనులు కొనసాగుతుంటే.. ఒప్పందంలో పేర్కొన్న మేరకే, 3 మీటర్ల వ్యాసం ఉన్న పైపులే ఏర్పాటు చేస్తున్నారని ఎవరైనా అనుకుంటారు. కానీ కాంట్రాక్టర్ 3.2 మీటర్ల వ్యాసం ఉన్న పైపులు ఏర్పాటు చేశారు. పైపుల వరుసలను 15 నుంచి 12కు కుదిస్తూ, పైపుల వ్యాసాన్ని పెంచుతూ డిజైన్ మార్చారన్నమాట. ఖర్చు గణనీయంగా తగ్గించుకోవడానికి కాంట్రాక్టర్ పథకం డిజైన్ మార్చినా, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే పనులు చేస్తున్నా.. అధికారులు కిమ్మనకపోవడానికి కారణమేమిటనేది ప్రశ్న. పైగా మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గిస్తే ఖర్చు తగ్గుతుందనే విషయం ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీతో సహా అధికారులు ఎవ రూ పట్టించుకోకపోవడం గమనార్హం.

 

 కనీసం రూ.260 కోట్లు కొట్టేయడానికే!


 కాంట్రాక్టర్ చెబుతున్నట్లుగా డిజైన్ మారిస్తే.. మొత్తం అంచనా వ్యయం రూ.1,300 కోట్లలో కనీసం 20 శాతం వ్యయం తగ్గుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. వ్యయాన్ని తగ్గించకుండానే డిజైన్ మార్పునకు ప్రభుత్వం ఆమోదిస్తున్నదంటే ఆ 20 శాతం.. అంటే రూ. 260 కోట్లు నొక్కేయడానికి వీలుగానే అనే ప్రచారం జరుగుతోంది.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top