ఆ గొడవ ఖరీదు.. రూ. 260 కోట్లు!

ఆ గొడవ ఖరీదు.. రూ. 260 కోట్లు!


వ్యాపం, లలిత్ గేట్ తదితర వివాదాలకు సంబంధించి పార్లమెంటులో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, అధికార బీజేపీకి మధ్య జరుగుతున్న వివాదం దేశ ఖజానా మీద భారీస్థాయిలో భారం పడుతోంది. పార్లమెంటు సమావేశాలు జరగాలంటే ఒక్క నిమిషానికి రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. ఒక ఏడాదిలో పార్లమెంటు మొత్తం 8 రోజుల పాటు జరుగుతుంది. (రోజుకు 24 గంటల చొప్పున లెక్క వేసుకుంటే). సాధారణంగా రోజుకు 6 గంటల చొప్పున ఉభయ సభలు సమావేశమవుతాయి.



అది కూడా సభ సజావుగా సాగితేనే. లేనిపక్షంలో దానిమీద పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఒక నిమిషం పాటు సభ జరగాలంటే.. అందుకు రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. ఈ విషయాన్ని గతంలో యూపీఏ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ బన్సల్ అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ.. మంత్రులు రాజీనామా చేయాలంటూ చేస్తున్న వివాదం వల్ల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కాస్తా కృష్ణార్పణం అయిపోతున్నాయి.



ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగకపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపు రూ. 260 కోట్ల నష్టం వాటిల్లినట్లయింది. ఇదంతా ప్రజల సొమ్మే. ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన సొమ్మునే ఎంపీలకు జీతభత్యాలుగా చెల్లిస్తారు. సభలో సజావుగా చర్చ జరిగి, తగిన చట్టాలు రూపొందితే వాటివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి.. ఆ ఖర్చు సార్ధకం అయినట్లే భావించుకోవచ్చు. కానీ, ఇప్పుడు అసలు చర్చకు ఏమాత్రం ఆస్కారం లేకుండా అధికార, విపక్షాలు ఎవరికి వారే పట్టుబడుతుండటంతో ఈ ఖర్చంతా ఎందుకూ పనికిరాకుండా అయిపోయింది. పార్లమెంటు సభ్యులకు ఇచ్చే సిట్టింగ్ అలవెన్సు నుంచి సమావేశాలు జరిగే సమయంలో వాళ్లకు అదనంగా చెల్లించే టీఏ, డీఏ, ఇతర భత్యాలు, పార్లమెంటు నిర్వహణ వ్యయం.. ఇవన్నీ కలుపుకొంటే నిమిషానికి రూ. 2.5 లక్షల వంతున.. ఇప్పటికి రూ. 260 కోట్లు ఖర్చయింది. ఆ ఖర్చంతా కూడా వృథా అయినట్లే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top