అక్కడ పెరిగిపోతున్న కిడ్నాప్‌ పెళ్లిళ్లు

అక్కడ పెరిగిపోతున్న కిడ్నాప్‌ పెళ్లిళ్లు - Sakshi


లాహోర్‌: పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన అనిలా ధావన్‌ అనే 17 ఏళ్ల హిందూ అమ్మాయిని గతేడాది ఓ ముస్లిం కిడ్నాప్‌ చేసి ఎత్తుకెళ్లాడు. బలవంతంగా ఆమె మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకోవడానికి కూడా నిరాకరించారు. అనిలా ధావన్‌ ఉద్దేశపూర్వకంగా ఇంటి నుంచి పారిపోయి వచ్చిందని, మతం మారి తనను పెళ్లి చేసుకుందంటూ ఆ ముస్లిం పెద్ద మనిషి చెప్పిన మాటలనే పోలీసులు నమ్మారు. లేదా నమ్నినట్లు నటించారు. ఇలాంటి విషయాల్లో సరైన చట్టాలు లేని కారణంగా తామేమి చేయలేమని పోలీసులు చేతులెత్తారు.



అంతటితో సరిపెట్టుకోకుండా ధావన్‌ తల్లిదండ్రులు లాహోర్‌ కోర్టుకెక్కారు. విచారణ సందర్భంగా ధావన్‌ వెళ్లడించిన వాస్తవాలను కోర్టు విశ్వసించింది. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పు చెప్పిందని ఆమె తరఫు న్యాయవాది రమేశ్‌ గుప్తా మీడియాకు తెలిపారు. అనిలా ధావన్‌ న్యాయపోరాటం ద్వారా కేసును గెలిచారు. కోర్టుదాక వెళ్లని ఆమెలాంటి అమ్మాయిల కేసులెన్నో. కిడ్నాప్‌ల ద్వారా బలవంతపు పెళ్లిళ్లు చేసుకొని పాకిస్తాన్‌లో బలవుతున్న హిందూ యువతులు, ముఖ్యంగా బాలికల జీవితాలెన్నో. 98 శాతం ముస్లింలు ఉంటున్న పాకిస్తాన్‌లో హిందువుల పట్ల చూపిస్తున్న వివక్ష అంతా ఇంతా కాదు.

 

పాకిస్తాన్‌లో ప్రతి ఏటా దాదాపు వెయ్యి మంది అమ్మాయిలను ముస్లింలు కిడ్నాప్‌ చేసి బలవంతపు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ‘దక్షిణాసియా పార్టనర్‌షిప్‌–పాకిస్తాన్‌’ అనే స్థానిక మానవ హక్కుల సంఘం తెలియజేసింది. వారిలో కొంతమంది క్రైస్తవులుంటుండగా ఎక్కువ మంది హిందూ అమ్మాయిలే ఉంటున్నారని తెలిపింది. ఈ కిడ్నాప్‌ల బారి నుంచి, మత విద్వేషం నుంచి తప్పించుకునేందుకు  ప్రతి ఏటా ఐదువేల మంది హిందువులు భారత్‌కు పారిపోయి వస్తున్నారని కూడా ఆ సంఘం పేర్కొంది.



దక్షిణ పాకిస్తాన్‌లో వ్యవసాయ కార్మికుడి కూతురైన అమెరీ కాశి కోహ్లీ అనే 14 ఏళ్ల అమ్మాయి ఇంట్లో పడుకున్నప్పుడు పొలం యజమాని ఎత్తుకెళ్లి, మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కూడా పోలీసులు జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే కోహ్లీ బెదిరింపులకు లొంగిపోయి ఇష్టపూర్వకంగానే పారిపోయి వచ్చి పెళ్లి చేసున్నానని తెలిపింది. ఇలాంటి సంఘటనలు నానాటికి పెరిగిపోతుండడంతో సామాజిక కార్యకర్తల ఆందోళన మేరకు సిం«ద్‌ రాష్ట్రం 18 ఏళ్లలోపు అమ్మాయిలను మతం మార్చి పెళ్లి చేసుకోవడం కుదరదంటూ ఓ బిల్లును తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కూడా ఆ బిల్లు సూచించింది.



జమాత్‌ ఉద్దవా లాంటి అతివాద ఇస్లాం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో వీగిపోయింది. హిందువుల వివాహాల రిజస్ట్రేషన్‌కు ఇటీవలనే అంగీకరించిన పాకిస్తాన్‌ ప్రభుత్వం హిందూ అమ్మాయిల కిడ్నాప్‌లను అరికట్టేందుకు జాతీయ చట్టాన్ని తీసుకరావాలని స్థానిక మానవ హక్కుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. పాకిస్తాన్‌లో హిందువులను ఎప్పుడూ తోటి మనుషులుగా చూడరని పాకిస్తాన్‌ నుంచి పారిపోయి వచ్చి ఢిల్లీలో చిన్న కిరాణ కొట్టు నడుపుకొంటున్న మీరాభాయ్‌ తెలిపింది. అమ్మాయిలనే కాదు, సరుకులను దొంగలిస్తారన్న ఆందోళన కూడా తమకు లేకుండా తాము ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నామని ఆమె తెలిపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top