మారణకాండకు మౌనసాక్షి..


  • పెషావర్ ఆర్మీ స్కూల్ ఆడిటోరియంలో 100 మంది విద్యార్థుల మృతదేహాలు

  • ఇస్లామాబాద్: పెషావర్‌లోని ఆర్మీ స్కూల్ ఆడిటోరియం.. రక్తపు మరకలతో భీతావహంగా, తాలిబాన్ రక్తపిపాసకు మౌనసాక్షిగా నిలుస్తోంది. ఈ ఒక్క ఆడిటోరియంలోనే వందకు పైగా విద్యార్థుల లేత దేహాలు ఉగ్రవాదుల మెషిన్‌గన్ల నుంచి దూసుకొచ్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమయ్యాయి. ప్రాణభయంతో టేబుళ్ల కింద, కుర్చీల వెనుక దాక్కున్న చిన్నారులను వెతికి మరీ, పారిపోతున్న వారిని వెంటాడి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కర్కశంగా కాల్చి చంపిన తాలిబాన్ హింసోన్మాదం కళ్లకు కట్టేలా అక్కడి దృశ్యాలున్నాయి.



    బుల్లెట్ల ధాటికి రంధ్రాలు పడ్డ గోడలు ఆ రాక్షసులెంత దారుణంగా కాల్పులు జరిపారో వివరిస్తున్నాయి. పాఠశాలలోకి మీడియాను అనుమతించిన ఆర్మీ.. వారికి ఆ ప్రాంతమంతా  తిప్పి చూపడంతో.. 132 మంది విద్యార్థులు సహా 148 మందిని బలి తీసుకున్న తాలిబాన్ ఘాతుకానికి సంబంధించిన పలు వివరాలు, ఫొటోలు బుధవారం వెలుగు చూశాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, పాదరక్షలు, నేలపై రక్తపు మరకలు, గోడలకు బుల్లెట్ దెబ్బలు.. పాఠశాలంతా యుద్ధభూమిలా ఉందని ఒక జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు.

     

    ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకుంటుండగా..

    స్కూల్ పక్కనున్న శ్మశానం నుంచి లోపలికి వచ్చిన ఉగ్రవాదులు.. తరగతి గదులు, ఆడిటోరియం వైపు వెళ్తూనే కాల్పులు ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులైన పలువురు విద్యార్థులు వెల్లడించారు. ‘ఆడిటోరియంలో ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకుంటుండగా కాల్పుల శబ్దం వినిపించింది. నేలపై బోర్లా పడుకోమని మా టీచర్ చెబ్తుండగానే.. లోపలికి వచ్చిన ఉగ్రవాదులు మమ్మల్ని అతి దగ్గర నుంచి కాల్చడం ప్రారంభించారు. పారిపోతున్న వారిని వెంటాడి మరీ కాల్చారు’ అని 7వ తరగతి చదువుతున్న మొహమ్మద్ జీషాన్ ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నాడు.



    తన రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని, బెంచ్ కింద దాక్కోవడంతో ప్రాణాలు కాపాడుకోగలిగానని హహ్రుఖ్ ఖాన్ అనే విద్యార్థి తెలిపాడు. కొందరు టీచర్లను సజీవ దహనం చేశారని కూడా వార్తలొచ్చాయి. పాఠశాల ప్రిన్సిపాల్ బాత్రూమ్‌లో దాక్కోగా ఉగ్రవాదులు వెంటిలేటర్ ద్వారా అందులోకి గ్రెనేడ్ విసరడంతో ఆయన చనిపోయారని సైనికదళాల ప్రధాన అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిమ్ బజ్వా వెల్లడించారు.



    మా దాడి న్యాయమే!

    ఈ నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటోలను తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సంస్థ బుధవారం విడుదల చేసింది. ఆర్మీ స్కూల్‌పై దాడి న్యాయమైనదేనని ప్రకటించింది. తమ యోధుల పిల్లలను, కుటుంబాలను చాలా  సంవత్సరాలుగా ఆర్మీ చంపేస్తోందని, అందుకే ఈ ప్రతీకార దాడి అని టీటీపీ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఉమర్ ఖొరాసని వ్యాఖ్యానించారు.

     

    148కి పెరిగిన మృతుల సంఖ్య

    పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై తాలిబాన్ జరిపిన పాశవిక దాడిలో మరణించినవారి సంఖ్య 148కి చేరింది. తీవ్రగాయాలతో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఏడుగురు బుధవారం చనిపోయారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top