దిలీప్ కుమార్ ఇంటిని కొనబోమన్న పాక్

దిలీప్ కుమార్ ఇంటిని కొనబోమన్న పాక్


కరాచి: పెషావర్‌లోని బాలివుడ్ పాతతరానికి చెందిన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పూర్వికుల ఇల్లుపై పాకిస్తాన్ కోర్టులో కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. మొన్నటిదాకా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెబుతూ వచ్చిన పాక్ హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ ప్రతిపాదనను తాము విరమించుకున్నామని పెషావర్ హైకోర్టుకు బుధవారం తేల్చి చెప్పింది. అయితే ‘పరిరక్షక పురాతన సంపద’గా ప్రకటించింది.



ఇలా ప్రకటించడం వల్ల ఆ ఇంటి ప్రస్తుత యజమాని ఆ ఇంటిని యధాతథంగా ఉంచాలి. ఎలాంటి మరమ్మతులు చేయరాదు. కొత్త నిర్మాణాలు చేపట్టరాదు. దీనిపై ఆ ఇంటి యజమాని హాజీ లాల్ మొహమ్మద్ ఖాన్ లబోదిబోమంటున్నారు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉందని, దాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణం చేపట్టరాదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.





దిలీప్ కుమార్ బాల్యమంతా ఆ పెషావర్ ఇంట్లోనే గడిచిందనడంపై భిన్న కథనాలు ఉన్నాయి. దిలీప్ కుమార్ 1922లో పుట్టారని, ఆ ఇంటిని ఆయన తండ్రి 1943లో కొన్నారని, అలాంటప్పుడు దిలీప్ కుమార్ బాల్యంలో అక్కడ ఎలా ఉంటారని ఖాన్ కోర్టులో సవాల్ చేశారు. పైగా దలీప్ తండ్రి ఆ ఇంటిని కొన్న మూడు రోజుల్లో మళ్లీ అమ్మేశారని చెప్పారు. అందుకు సాక్ష్యాలుగా ఇంటికి సంబంధించిన దస్తావేజులు చూపించారు.



ఇంతకు ఆ ఇంటిని కొంటున్నారా, లేదా ? అంటూ వాదనల సందర్భంగా పెషావర్ హైకోర్టు స్థానిక ప్రభుత్వాన్ని నిలదీసింది. కొనడం లేదని, బేరం కుదరలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2012లోనే ఆ ఇంటిని కొనాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 30లక్షల పాకిస్తాన్ రూపాయలను చెల్లిస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మాటమార్చి కేవలం 11 లక్షల రూపాయలకే అమ్మాలని షరతు పెట్టింది. అందుకు ఇంటి ప్రస్తుత యజమాని ఖాన్ ససేమిరా అంగీకరించకపోవడంతో ఆ మొత్తాన్ని 14 లక్షల రూపాయలకు పెంచింది. ఆందుకూ ఖాన్ ఒప్పుకోలేదు. చివరకు కొనము పొమ్మంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top