హోదా లేదు... ప్యాకేజీయే!

హోదా లేదు... ప్యాకేజీయే! - Sakshi


పునర్వ్య్‌వస్థీకరణ చట్టం హామీల పరిష్కారం దిశగా..

రాయితీలు... గ్రాంటు శాతం పెంపు ప్రతిపాదనలు

కేంద్ర సంస్థలు, రైల్వేజోన్ ఏర్పాటుకు సుముఖం..

ముగిసిన కేంద్రం కసరత్తు.. ముసాయిదా సిద్ధం..

ప్రధాన మంత్రికి నివేదించిన ఆర్థిక శాఖ

త్వరలో వెలువడనున్న ప్రకటన


 

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు లేనే లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాల అందుతున్న సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చేయాల్సిన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు తదితర అన్ని అంశాలతో కలిపి రూపొందించిన ముసాయిదాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించి ఆయన సమ్మతిని తీసుకున్నట్టు తెలుస్తోంది.



తగిన న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరగా దీనిపై ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముసాయిదాలో ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డుపడుతున్న కారణాలను పొందుపరిచినట్టు సమాచారం. ఇక చట్టబద్ధంగా వివిధ శాఖల ద్వారా మౌలిక వసతుల ఏర్పాటుకు ఇవ్వాల్సిన సాయం, రైల్వేజోన్ సహా అంశాల వారీగా ముసాయిదాలో పేర్కొంటూ ప్యాకేజీని తయారుచేసినట్టు సమాచారం. వెనకబడిన జిల్లాలకు ఇప్పటివరకు ఇస్తున్న అభివృద్ధి సాయాన్ని పెంచినట్టు తెలుస్తోంది.



 ముసాయిదాలో ఏముంది?

 పునర్వ్య్‌వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) కింద కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు వీలుగా పన్ను ప్రోత్సాహకాలు సహా సముచితమైన ఆర్థికపరమైన  చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 15 శాతం అదనపు డిప్రీసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను కేంద్రం ప్రకటించింది.  పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవని, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించాలని ఏపీలో ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ వచ్చింది. పన్ను ప్రోత్సాహకాలను రాష్ట్రం మొత్తానికి వర్తింపజేయాలని కోరుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాయితీలను మరికొంత పెంచుతూ ముసాయిదాలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.



ఏపీ పునర్వ్య్‌వస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచిన మౌలికవసతుల ఏర్పాటుకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పునర్వ్య్‌వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకుని సముచిత రీతిలో గ్రాంట్లను విడుదల చేయాల్సి ఉంది.  వెనకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. విభజన జరిగిన తొలి సంవత్సరంలో రాష్ట్రం ఏర్పాటు నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఆమోదంలోకి వచ్చేంతవరకు రెవెన్యూ లోటును 2014-15 కేంద్ర బడ్జెట్‌లోనే కేటాయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా తేల్చి ఇంకా రావాల్సి ఉన్న బకాయిలను చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.

స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించలేకపోతున్నందున కేంద్రం.. రాష్ట్రాలకు చేసే ఆర్థిక సాయంలో గ్రాంటు శాతాన్ని పెంచేలా నిర్ణయం జరిగిందని.. ఇది కేవలం ఏపీకి వర్తించేలా చేసినట్టు తెలుస్తోంది.



 కోరాపుట్-బొలాంగిర్-కలహండి (కేబీకే) తరహాలో..

వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ... కోరాపుట్-బొలాంగిర్-కలహండి(కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని ఆనాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ కేంద్రం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేస్తూ వచ్చింది. వాస్తవానికి కేబీకే ప్రత్యేక ప్రణాళిక, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ కింద ఆయా ప్రాంతాలకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందినట్టు అంచనా. ఈమేరకు ముసాయిదాలో ఈ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా చేర్చినట్టు సమాచారం.

పునర్వ్య్‌వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయంతోపాటు పునరావాసానికి కూడా కేంద్రం కేటాయిస్తుందని ఆ చట్టం చెబుతోంది. రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులు చెల్లిస్తూ వచ్చింది. నాబార్డు ద్వారా ప్రత్యేక రుణాన్ని తీసుకుని పోలవరంపై వెచ్చించేలా కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని ముసాయిదాలో పొందుపరిచారని తెలుస్తోంది.

సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఇళ్లు, సామాజిక మౌలిక వసతులు నిర్మించుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని అడిగింది. రాజధాని అవసరాల కోసం ముసాయిదాలో దాదాపు రూ. 4 వేల కోట్ల మేర ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఏపీ పునర్వ్య్‌వస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్శిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధానాసుపత్రిని, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాల్సి ఉంది. వీటన్నింటికీ అయ్యే వ్యయంపై చేసే సాయాన్ని కూడా ముసాయిదాలో పొందుపరిచినట్టు సమాచారం.

 

 రైల్వే జోన్ కూడా..

 పునర్వ్య్‌వస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలు సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర నగరాలకు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీని ఏర్పాటుచేస్తామని 13వ షెడ్యూలు హామీ ఇచ్చింది. వీటికి ముసాయిదాలో పరిష్కారం చూపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top