అమెరికాలో పెనుముప్పు.. ఎన్నారైల ప్రాంతాలు ఖాళీ






అమెరికాలో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దాంతో ఓరోవిల్లె పరిసర ప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎన్నారైలు ఉంటారు. మొత్తం జనాభాలో 13 శాతం మంది పంజాబీలు, సిక్కులేనని తెలుస్తోంది. ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్‌వే వద్ద ఒక రంధ్రం కనిపించడంతో ఏ క్షణంలోనైనా డ్యాం బద్దలయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఈ ప్రాంతమంతా కొట్టుకుపోతుందని అంటున్నారు. రంధ్రాన్ని మూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందువల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. ఓరోవిల్లె డ్యాం ఆగ్జిలరీ స్పిల్‌వేకు రంధ్రం పడిందని, దానివల్ల ఓరోవిల్లె చెరువు నుంచి భారీ మొత్తంలో వరద నీరు ముంచెత్తొచ్చని జాతీయ వాతావరణ శాఖ తొలుత తెలిపింది. 

 


 

పరిస్థితి ఏమాత్రం తమ అదుపులో లేదని, అందువల్ల ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పారు. ఓరోవిల్లె నగరంలో సుమారు 16వేల మంది ఉంటారు. వాళ్లలో చాలామంది ఎన్నారైలు ఉన్నారని తెలుస్తోంది. అందులోనూ పంజాబీలు, సిక్కులు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్లందరినీ చికో నగరం వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. యుబా కౌంటీకి కూడా ప్రమాదం ఉందని, అందువల్ల వాళ్లు కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఇది ఏదో ప్రయోగాత్మకంగా చేస్తున్న డ్రిల్ కాదని, అందువల్ల ప్రజలు వెంటనే కదలాలని జాతీయ వాతావరణ శాఖ నొక్కిచెప్పింది. ఇటీవలి కాలంలో వర్షాలు, మంచు ఎక్కువగా పడుతుండటంతో నీరు ఎక్కువగా చేరిందని, నీటి ఒత్తిడి వల్లే స్పిల్‌వేకు రంధ్రం పడి ఉంటుందని అధికారులు అంటున్నారు. డ్యాం నుంచి భారీ మొత్తంలో నీళ్లు వస్తున్నట్లు హెలికాప్టర్ల ద్వారా తీసిన వీడియోలో కనిపించింది. స్పిల్‌వేకు మరమ్మతులు చేయడానికి సుమారు రూ. 670-1300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 








Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top