వంద కోట్ల ఏళ్ల క్రితమే..

వంద కోట్ల ఏళ్ల క్రితమే..


భూమి ఇన్నర్‌కోర్‌పై శాస్త్రవేత్తల తాజా అంచనా



 లండన్: భూమి ఇన్నర్‌కోర్(భూ ఉపరితలానికి 3 వేల కిలోమీటర్ల లోపల ఉండే చిట్టచివరి పొర) సుమారు ఒక వంద కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్టుగా బ్రిటిష్ పరిశోధకులు తాజాగా అంచనా వేస్తున్నారు. భూమి లోని ఔటర్ కోర్‌లో ఉండే ద్రవ రూప ఇనుము కారణంగా ఇన్నర్ కోర్ ఘనీభవించడం ప్రారంభమైందని చెప్తున్నారు. ఇన్నర్ కోర్ ఎప్పుడు ఏర్పడిందనే విషయంపై ఇప్పటి వరకూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన పరిశోధకులు తాజాగా చేసిన అధ్యయనంలో భూమి ఇన్నర్ కోర్ వంద కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని తేలింది.



పురాతన కాలంనాటి అగ్ని శిలలకు సంబంధించిన అయస్కాంత రికార్డులను పరిశీలించిన అనంతరం వీరు ఈ అంచనాకు వచ్చారు. 100 కోట్ల ఏళ్ల క్రితం ఔటర్ కోర్‌లో ఇనుము ద్రవరూపంలో అత్యంత చల్లగా ఉండటంతో ఇన్నర్ కోర్‌లో ఉండే ద్రవపదార్థాలు ఘనీభవించడం ప్రారంభించాయన్నారు. తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు భూ చరిత్ర, దాని భూకేంద్రం గురించి ఇప్పటి వరకూ ఉన్న అంచనాలను మార్చేస్తాయని ఈ పరిశోధకులు పేర్కొన్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top