‘వరంగల్’ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్వే

‘వరంగల్’ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్వే - Sakshi


- రేసులో దామోదర, మల్లు, సర్వే, రాజయ్య

- ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపైనా చర్చ

సాక్షి, హైదరాబాద్:
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానవర్గం రహస్యంగా సర్వే నిర్వహిస్తోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, అధిష్టానవర్గ మెప్పును పొందాలని టీపీసీసీ ముఖ్యనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.



అయితే ఈ ఉప ఎన్నికలో బరిలోకి దింపే అభ్యర్థి ఎంపికను అటు పార్టీ అధిష్టానం, ఇటు టీపీసీసీ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఇక్కడ పార్టీ సీనియర్లలో ఒకరిని రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే రహస్యంగా ఒక సర్వేను చేసినట్టుగా పార్టీ సీనియర్లు వెల్లడించారు. పార్టీ బలాబలాలు, పార్టీ నేతల మధ్య సమన్వయం, అభ్యర్థులపైనా సర్వే జరుగుతోంది. సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు భట్టివిక్రమార్క, సర్వే సత్యనారాయణ, వివేక్‌తో పాటు సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్, మరికొందరు స్థానిక నేతల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.



రాజనర్సింహ లేదా భట్టివిక్రమార్క పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు జేఏసీలో కీలకంగా వ్యవహరించిన తటస్థుల పేర్లు కూడా పార్టీలో అంతర్గతంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జేఏసీ నేతలు ఎవరెవరు అనేది నిర్దిష్టంగా వెల్లడికాలేదు. మరోవైపు ఈ వరంగల్ లోక్‌సభ స్థానంలో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీపీసీసీలో జరుగుతోంది. ఇప్పటికే వామపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ఎంపికపై చర్చించాలని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన తదితర అంశాలను అధిష్టానవర్గానికి నివేదించనున్నట్టుగా తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top