మనిషిని పొడిచి దండలు వేస్తారా?

మనిషిని పొడిచి దండలు వేస్తారా? - Sakshi


చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

- బాబు పబ్లిసిటీ పిచ్చే పుష్కరాల తొలిరోజు 29 మంది భక్తుల ప్రాణాలు తీసింది

- సీఎం వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్న ప్రతిపక్ష నేత

- పలుమార్లు మైక్ కట్ చేసిన స్పీకర్

సాక్షి, హైదరాబాద్:
‘మనుషుల్ని పొడిచేసి మళ్లీ వాళ్లకే దండలు వేసి నివాళులు అర్పించడమంటే ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఉందా?’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..  ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల తొలిరోజే 29 మంది భక్తుల ప్రాణాలు పోవడానికి బాబు పబ్లిసిటీ పిచ్చే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి వాళ్ల ప్రాణాలు తీసిన వ్యక్తే సానుభూతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిం చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు.



అమాయకుల ప్రాణాలు పోవడానికి ముఖ్యమంత్రే బాధ్యుడని, వీఐపీలకు కేటాయించిన ఘాట్‌లో సీఎం స్నానం, పూజాదికాలు నిర్వహించుకుని ఉంటే అమాయకుల ప్రాణాలు పోయుండేవి కాదని అన్నారు. పుష్కరాల మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ సీఎం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జగన్ మాట్లాడారు. ‘చంద్రబాబే దగ్గరుండి ఆ 29 మంది చావుకు కారణమయ్యారు. మరోవైపు ఆయన వారికి నివాళులర్పిస్తున్నారు. వాస్తవానికి సామాన్య భక్తులకు ఆటంకం కలుగకూడదనే వీఐపీలకు ప్రత్యేకంగా ఘాట్ పెట్టారు.



ఆ మేరకు సరస్వతి ఘాట్‌లో వీఐపీల స్నానాలకు పాస్‌లిచ్చారు. కానీ ఈ సీఎం ప్రచారం కోసమని.. స్నానాలు, పూజల చిత్రీకరణ కోసం సినిమా షూటింగ్‌ను తలపించేలా తానే హీరోలా కనబడేలా మేకప్ వేసుకుని సామాన్యులకు కేటాయించిన ఘాట్ కు వెళ్లడంతో తొక్కిసలాట జరిగి అమాయకుల ప్రాణాలు పోయాయి’ అంటుండగా అధికార పక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. మం త్రి యనమల మాట్లాడుతూ సంతాప తీర్మానంలో ఈ వ్యాఖ్యలు ఏమిటని ప్రశ్నించారు. దీనికి ధీటుగా విపక్ష సభ్యులూ స్పందించారు. జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించబోతుం డగా ఆయన మైకును స్పీకర్ కట్ చేశారు.

 

సభను కించపరుస్తున్నాననడం అన్యాయం

స్పీకర్ మాట్లాడుతూ విపక్ష నేత వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. చంద్రబాబును ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొత్తం సభపైనే చేసినట్టు వ్యాఖ్యానించారు. జగన్ మొత్తం సభనే కించపరుస్తున్నారన్నారు. దీనికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. ‘నేను ముఖ్యమంత్రిపై మాట్లాడితే మొత్తం సభనే కించపరిచినట్టుగా స్పీకర్ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఆ 29 మందిని చంపేసిన వ్యక్తే ఇప్పుడు సంతాపం అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.



సీఎం వీఐపీలకు కేటాయించిన సరస్వతి ఘాట్‌కు వెళ్లుంటే ఈ ఘోరం జరిగేది కాదు’ అని అంటుండగా ఆయన మైకు మళ్లీ కట్ అయింది. స్పీకర్ ముఖ్యమంత్రికి మైకివ్వడంతో ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియంలోకి దూసుకువెళ్లి తమ నేత మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ప్రతిపక్ష నేతను ఏకంగా మూర్ఖుడంటూ నిందించారు. దీంతో స్పీకర్ ఆ పదాన్ని ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడిని కోరారు. ‘వాచ్ యువర్ టంగ్ ’ (ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి) అని మందలించారు.  

 

ఎలా చనిపోయారో చెప్పకపోతే ఎలా?

తీవ్ర గందరగోళం అనంతరం జగన్ మాట్లాడుతూ ‘చనిపోయినవారు ఎలా చనిపోయారనేది సంతాప తీర్మానంలో చెప్పకపోతే ఎలా? అబ్దుల్ కలాం ఎలా చనిపోయారో చెప్పుకున్నామా లేదా? వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే అసలేం జరిగిందో మాట్లాడాలి కదా..’ అని అన్నారు. ‘పుష్కరాల్లో చనిపోయినదానికి అధికార పక్షానికి బాధ లేదా?..’ అని ప్రశ్నిస్తుండగా.. చంద్రబాబు మాట్లాడతానంటూ చేయి పైకి ఎత్తారు. దీంతో జగన్ మైకును స్పీకర్ మరోమారు కట్ చేశారు.

 

ఇలాగే ఉంటే మేం చేయదల్చుకుంది చేస్తాం: బాబు    

సంతాప తీర్మానాన్ని రాజకీయం చేయ డం తగదని చంద్రబాబు అన్నారు. పుష్కరాలపై చర్చ సందర్భంగా ఇట్లాంటివి మాట్లాడవచ్చన్నారు. విపక్షం సభ్యత లేకుండా మాట్లాడుతోందని విమర్శించారు. చర్చకు రావాలని సవాల్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి మార్కులు కొట్టేయలేరన్నారు. ప్రతి పక్షం హుందాగా ఏమడిగినా చెప్తామని, అడ్డగోలుగా వ్యవహరిస్తే తాము చేయదలచుకున్నది తాము చేస్తామంటూ బెదిరించారు. క్రమశిక్షణ పాటించకపోతే మీకే నష్టమని స్పీకర్ విపక్షాన్నుద్దేశించి అన్నారు.



ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ... షూటింగ్ చేసుకుంటూ పుణ్యం కోసం వచ్చిన భక్తుల ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రే.. సంతాప తీర్మానం పెడితే ఏమనుకోవాలంటుండగా స్పీకర్ ఇంకోసారి మైక్ కట్ చేశారు. వ్యక్తులపైన, సభపైనా విపక్ష నేత చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లోకి పోవంటూ ప్రకటించారు. గందరగోళం మధ్యనే.. సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించి సభ రెండు నిమిషాలు మౌనం పాటిస్తుందంటూ లేచి నిలుచున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top