ఐ లవ్యూ మిషెల్లీ!

ఐ లవ్యూ మిషెల్లీ!


ఫిలడెల్ఫియా: అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తన అద్భుతమైన ప్రసంగంతో ఆహూతులను కట్టిపడేశారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటిస్తూ మిషెల్లీ చేసిన ప్రసంగం ‘నభూతో’ అన్నతరహాలో ఆద్యంతం పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. అమెరికాకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు కావడం ఎంత ప్రయోజనకరమో చెప్తూనే.. సందర్భోచితంగా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాగ్బాణాలు సంధించారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిన తరుణంలో పార్టీ జాతీయ సదస్సులో ఆమె చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సమధికోత్సాన్ని, ఐక్యతను నింపింది.



‘ఈ ఎన్నికల్లో నేను విశ్వసించే బాధ్యతాయుతమైన వ్యక్తి, అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలైన ఏకైక వ్యక్తి.. అది మన fమిత్రురాలు హిల్లరీ క్లింటనే’ అంటూ మిషెల్లీ ప్రకటించారు. భావోద్వేగాలను మిళితం చేస్తూ ఆమె ప్రసంగం సాగుతుండగా.. ఆహూతులు పలుసార్లు లేచినిలబడి కరతాళ ధ్వనులతో తమ హర్షం ప్రకటించారు. లింగ, జాతి వివక్షతలు, ట్రంప్‌ ప్రాతిపదిస్తున్న విచ్ఛిన్నకరమైన రాజకీయాలను పరోక్షంగా విమర్శిస్తూ మిషెల్లీ ప్రసంగం సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి ఏమాత్రం అర్హులు కారని ఆమె స్పష్టం చేశారు. ‘మనం దేశం గొప్పది కాదని, దానిని మళ్లీ గొప్పగా చేయాల్సిన అవసరముందని చెప్తున్నవారిని ఎంతమాత్రం అంగీకరించండి. ఇప్పుడు భూమిపై ఉన్న గొప్ప దేశం మనదే’ అని మిషెల్లీ పేర్కొన్నారు.



భార్య మిషెల్లీ ప్రసంగానికి ఫిదా అయిపోయిన అధ్యక్షుబు బరాక్ ఒబామా.. ఆమెను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘గొప్ప మహిళ చేసిన గొప్ప ప్రసంగం ఇది. నువ్వు అమెరికా ప్రథమ పౌరురాలిగా ఉండటం నిజంగా గర్వకారణం. ఐ లవ్యూ మిషెల్లీ’ అంటూ ఒబామా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top