ఎన్టీఆర్ పేరును తొలగించం

ఎన్టీఆర్ పేరును తొలగించం


* శంషాబాద్ దేశీయ టెర్మినల్ పేరుపై రాజ్యసభలో కేంద్రం వెల్లడి

* గతంలో ఉన్న పేరునే పునరుద్ధరించామని అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

* సభా కార్యక్రమాలను అడ్డుకున్న టీకాంగ్రెస్ ఎంపీలు

* రాజ్యసభ పలుమార్లు వాయిదా, గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన



సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మళ్లీ దుమారం రేగింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో బుధవారం సభ పలుమార్లు వాయిదా పడింది. మరోవైపు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించామని, దాన్ని తొలగించడానికి అంగీకరించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.



జీరో అవర్‌లో ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ మాట్లాడారు. ‘మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. నీతి నియమాలు సంకటంలో పడ్డాయి. సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. రాజుల కుటుంబం నుంచి వచ్చిన పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కుయుక్తులకు పాల్పడుతున్నారు. కేంద్రం నిర్ణయం తెలంగాణ, హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను మనోవేదనకు గురిచేస్తోంది. ఇలాంటి కుయుక్తులతో విభేదాలను, అనవసర ఇబ్బందులు మాత్రమే పొడచూపుతాయి. ఎలాంటి ఫలితాలను ఇవ్వవు.



అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఒక పైలట్. ఆయన ఈ రంగంలోకి హైదరాబాద్‌లోనే ప్రవేశించారు. అందువల్లే హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరును పెట్టారు. ప్రజలకు ఒక జ్ఞాపకంగా ఉంటుందనే అలా చేశారు. అయితే ఇప్పుడు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడం అవాంచిత చర్య. దాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందువల్ల రాజీవ్‌గాంధీ పేరును కొనసాగిస్తూ ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.



ఆనంద్ భాస్కర్ తన ప్రసంగాన్ని ముగించబోతుండగానే వి.హన్మంతరావు, ఎం.ఎ.ఖాన్ తదితరులు ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌కే చెందిన మరో ఎంపీ ఆనంద్‌శర్మ కూడా తనకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరగా డిప్యూటీ చైర్మన్ అందుకు అనుమతించలేదు. ఈ సమయంలోనే సభలో మరింత గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు.



‘కాంగ్రెస్ సభ్యులు ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. రాజీవ్‌గాంధీ, ఎన్.టి.రామారావు ఇద్దరూ ఈ దేశంలో గౌరవనీయులైన నాయకులే. ప్రభుత్వంలో ఉన్నవారెవరికీ వారిని అగౌరవపరచాలని లేదు. పౌరవిమానయాన మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు ఉంది. అదే కొనసాగుతుంది. అలాగే డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్.టి.రామారావు పేరు ఉంది. అదే కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఇదే అంశంపై అశోక్ గజపతిరాజు మాట్లాడబోతుండగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ‘మీకు జవాబు కావాలా? వద్దా?’ అంటూ మంత్రి ప్రశ్నించారు. తిరిగి జైట్లీ లేచి.. ‘ఎన్టీఆర్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.



ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలు మరింత పెరగడంతో సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి మారకపోవడంతో సభను చైర్మన్ అరగంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాతా సభలో గొడవ సద్దుమణగలేదు. దీంతో ఒంటి గంట వరకు రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు వి.హన్మంతరావు, ఆనంద్‌భాస్కర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తదితరులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top