ఉద్యోగాల మూట విప్పండి సార్!

ఉద్యోగాల మూట విప్పండి సార్! - Sakshi


రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల ఎదురుచూపులు

25 వేల ఉద్యోగాలని ఊరించారు.. మూడో వంతు పోస్టులనే ప్రకటించారు

ఐదో వంతు ఉద్యోగాలకే నోటిఫికేషన్లు.. నత్తనడకన సాగుతున్న భర్తీ ప్రక్రియ

ఉద్యోగార్థుల జేబులు గుల్ల చేస్తున్న కోచింగ్ సెంటర్లు

⇒  సీఎం ఇచ్చిన మాట: 25,000 ఉద్యోగాల భర్తీ

తొలుత ప్రకటించింది: 15,522 ఉద్యోగాలు

ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇచ్చింది: 3,485 పోస్టులకు

(అందులో 3,175 పోస్టులు ఇంజనీరింగ్ పట్టభద్రులకే)


 

సాక్షి, హైదరాబాద్: పంచ పాండవులు.. మంచం కోళ్లలా ముగ్గురని చెబుతూ రెండు వేళ్లను చూపించినట్లుంది.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ తీరు! ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ ఆచరణ పట్టాలెక్కలేక కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం జూలై నెలాఖరున ఆదరాబాదరాగా పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ చెప్పినంత వేగంగా నోటిఫికేషన్లు జారీ కాకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

 సీఎం ప్రకటనతోపాటు మంత్రి మండలి 25 వేల ఉద్యోగ నియామకాలకు ఆమోదం తెలిపింది. అందులో 15,522 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సర్కారు... మిగిలిన 10 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడుతుందా..? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. తొలి విడత నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్‌సీతో పాటు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో డిపార్టుమెంటల్ సెలక్షన్ బోర్డులు ఈ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ నత్తనడకన సాగటం నిరుద్యోగుల పాలిట అశనిపాతంగా మారింది.

 

 అన్నీ ఇంజనీర్లకే..

 ప్రకటించిన పోస్టుల్లో ఇప్పటివరకు అయిదో వంతు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. టీఎస్‌పీఎస్‌సీ, టీఎస్‌జెన్‌కో సారథ్యంలో 3,485 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.  మిగతా 12,087 పోస్టుల నోటిఫికేషన్లు నిరుద్యోగులను ఊరిస్తూనే ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటివరకు తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. వివిధ విభాగాల్లో 2,629 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. వీటిలో 120 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 75 హార్టికల్చర్ పోస్టులు, 115 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్లు మినహా మిగతా పోస్టులన్నీ ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించినవే ఉన్నాయి. వీటితోపాటు 856 ఏఈ పోస్టుల భర్తీకి టీఎస్‌జెన్‌కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి కూడా ఇంజనీరింగ్ పట్టభద్రులకు మాత్రమే కావటంతో ఇతర కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ కొనసాగుతోంది.

 

 పండుగ చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లు

 ఉద్యోగుల భర్తీకి సర్కారు అనుమతిచ్చి రెండున్నర నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిని తలపిస్తున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో రేపో మాపో గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నట్లుగా ఇటు ప్రభుత్వం.. అటు టీఎస్‌పీఎస్‌సీ హంగామా చేసింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చంటూ కోచింగ్ సెంటర్లు భారీ ప్రచారంతో నిరుద్యోగుల జేబులు గుల్ల చేసేందుకు పోటీ పడుతున్నాయి. తొలిసారిగా తెలంగాణ దృక్పథంతో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా భారీ వ్యాపారానికి ద్వారాలు తెరిచాయి. మరోవైపు రోజుకో కొత్త పుస్తకంతో ప్రైవేటు పబ్లిషర్లు పోటాపోటీగా నిరుద్యోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.

 

 గ్రూప్స్‌పై సందిగ్ధత..

 తొలి విడతగా ప్రకటించిన వాటిలో గ్రూప్-1 పోస్టులు 52, గ్రూప్-2 పోస్టులు 434 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ల జారీపై స్పష్టత లేదు. గ్రూప్-2 పరీక్షల్లో 75 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించినట్లుగా టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల విధానాన్ని ప్రకటించింది. ఆ తర్వాత గ్రూప్-3, గ్రూప్-2 పరీక్షలకు ఇంటర్వ్యూ నిర్వహించవద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గ్రూప్-2 పరీక్షలకు ఇంటర్వ్యూ నిర్వహించాలా.. వద్దాఅనే విషయంలో టీఎస్‌పీఎస్‌సీ మల్లగుల్లాలు పడుతోంది. తొలుత ప్రకటించిన వాటిలో యూనిఫాం, టెక్నికల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. పోలీసు విభాగంలోని పోస్టులతోపాటు విద్యుత్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులే మూడొంతులకు పైగా ఉన్నాయి. సాధారణ పోస్టులు తక్కువగా ఉండటంతో ఈ ఉద్యోగ ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకోలేకపోయింది. అందులోనూ అత్యధికంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో రెండో విడత ఉద్యోగాల భర్తీపైనే నిరుద్యోగులు గంపెడాశలతో నిరీక్షిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top