తేలని పంచాయితీ

తేలని పంచాయితీ


విభజన అంశాలపై ఎవరి వాదన వారిదే

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన అంశంపై హస్తిన చేరినా పంచాయతీ తెగలేదు. ఇక్కడి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో హోం శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్ నేతృత్వంలోని వివాదాల పరిష్కారాల కమిటీ శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ విషయంలో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, షెడ్యూలు-10లో పొందుపరచిన సంస్థలు, సెక్షన్-8 ద్వారా ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతిభద్రతలపై సంక్ర మించిన అధికారాలపై చర్చ జరిగింది.

 

 అయితే ఆయా అంశాల్లో పరస్పర అంగీకారం కుదిరిన అంశాలు స్వల్పమే. ఇక విభజనకు ముందున్న పన్ను బకాయిలపై కూడా హోం శాఖ స్పష్టత ఇవ్వనట్టు సమాచారం. తొలుత షెడ్యూలు-9లోని 85 సంస్థల పంపిణీపై చర్చ జరగగా కేవలం ఆరు సంస్థలు మినహా అన్నింటిపై అంగీకారం కుదిరింది. ఆర్టీసీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ట్రేడ్ ప్రమోషన్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్స్ తదితర ఆరు సంస్థల్లో పరస్పర అంగీకారం కుదరలేదు. మిగిలిన అన్ని సంస్థల పంపిణీలో అంగీకారం కుదిరినందున వాటి పంపిణీకి షీలాభిడే కమిటీ తుది సిఫారసులు ఖరారు చేస్తుందని, ఆ సిఫారసులకు అనుగుణంగా నడచుకోవాలని నిర్ణయించారు.

 

 షెడ్యూలు-10పై న్యాయశాఖ సలహా...

 ఇక షెడ్యూలు 10లో 107 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో ఇటీవల హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భౌగోళిక/ప్రాదేశిక ప్రాంతాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకే చెందుతాయన్న ఈ తీర్పు ప్రకారం అన్ని సంస్థల విషయంలో నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరగా... ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేశామని, తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కోరారు. ఈ విషయంలో న్యాయశాఖ సలహా తీసుకుని స్పష్టత ఇస్తామని హోం శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే షెడ్యూలు-10లోని సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం సేవలు కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అవసరమైన పాలనావ్యయం భరించాలని తెలంగాణ సూచించింది.

 

 గవర్నర్ అధికారాలపై స్పష్టత కరువే

 పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-8లో పేర్కొన్న రీతిలో ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతిభద్రతలపై ఉండాల్సిన ప్రత్యేక అధికారాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఏపీ సీఎస్ కృష్ణారావు కోరగా... తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ వ్యతిరేకించారు. దీనిపై చట్టంలోనే స్పష్టంగా ఉందని, ప్రత్యేక మార్గ దర్శకాలు అవసరం లేదని స్పష్టంచేశారు. దీనికి హోం శాఖ కార్యదర్శి స్పందిస్తూ... ఈ విషయమై గవర్నర్‌తో మాట్లాడతామన్నారు.

 

 పన్ను బకాయిలు ఇచ్చేలా చూడండి: కృష్ణారావు

 ఉమ్మడి రాష్ట్రంలోని పన్ను బకాయిలను తెలంగాణలోనే ఉన్న ప్రధాన కార్యాలయాలు వసూలు చేసుకోవచ్చని చట్టంలో చెప్పడంవల్ల తాము నష్టపోతున్నామని చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు తెలిపారు.  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బకాయిల్లో తమ వాటా తమకు వచ్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు.

 

 చట్టప్రకారమే జరగాలని చెప్పాం: రాజీవ్‌శర్మ

 పన్ను బకాయిల వసూళ్లు, గవర్నర్ అధికారాల విషయంలో చట్ట ప్రకారం నడచుకునేలా చూడాలని హోం శాఖను కోరామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మీడియాకు వివరించారు. షీలా భిడే కమిటీ నివేదిక వచ్చేవరకు షెడ్యూలు-9 విషయంలో ముందు కు వెళ్లరాదని కోరినట్టు తెలిపారు. షెడ్యూలు-10 కింద ఉన్న సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే బకాయిలు కూడా ఆ రాష్ట్రానికే చెందుతాయని చెప్పారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top