వీడు మామూలోడు కాదు!

వీడు మామూలోడు కాదు!


లండన్: రిమ్ జిమ్ జిమ్.. అంటూ ఓ బాలభీముడు అవలీలగా కసరత్తులు చేస్తున్నాడు. కష్టసాధ్యమైన కసరత్తులు కొట్టినపిండిలా చేసేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదు ప్రపంచంలోని బలవంతుడైన పిల్లాడు(స్ట్రాంగెస్ట్ కిడ్) గా గుర్తింపు పొందాడు.



'రుమేనియన్ హెర్క్యులస్' అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న ఈ బాల భీముడు పేరు గిలియానో స్ట్రొయ్. ఈ చిచ్చరపిడుగు వయసు తొమ్మిదేళ్లు. దక్షిణ రుమేనియాలోని ఇకోయానా చెందిన ఈ బుడ్డ బలశాలి 90 డిగ్రీల ఫుష్- అప్ లు ఈజీగా చేసేస్తున్నాడు. కడ్డీపై రెండు చేతులు ఆన్చి వాటి మీదే మొత్తం బాడీని నిలబెట్టి బ్యాలన్స్ చేసుకుంటూ అతడి చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. రుమేనియన్ హెర్క్యులస్ విన్యాసాల వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ కలిగివున్న స్ట్రొయ్ 90 డిగ్రీల వెర్టికల్ ఫుష్-అప్ లో రెండు వరల్డ్ రికార్డులు బద్దలు గొట్టాడు.



గిలియానో స్ట్రాయ్ తమ్ముడు కూడా బాల భీముడే. వీరిద్దరూ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బాయ్ బాడీ బిల్డర్లుగా గుర్తింపు పొందారు. గిలియానో తల్లిదండ్రులు లులియాన్, ఇలియానా. తమ పిల్లలు ప్రతిరోజు రెండున్నర గంటలపాటు కష్టసాధ్యమైన కసరత్తులు చేస్తుంటారని వారు వెల్లడించారు. పిన్నవయసులో అద్భుతాలు చేస్తున్న గిలియానో స్ట్రొయ్ ను చూసినవాళ్లందరూ వీడు మామూలోడు కాదంటూ పొగిడేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top