అమెరికాలో మనోడి సాహసం.. చేదు అనుభవం




న్యూయార్క్: ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడేందుకు ఓ భారతీయుడు ప్రదర్శించిన తెగువను అమెరికా సహా యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. అదే సమయంలో దోపిడీకి గురై చేదు అనుభవాన్ని చవిచూసిన అతనికి అమెరికా ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త వివరాల్లోకి వెళితే..

 

అనిల్ వన్నవల్లి (34) అనే భారతీయుడు న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మాన్ హట్టన్ లోని తన కార్యాలయానికి వెళ్లేందుకుగానూ శుక్రవారం ఎడిసన్ స్టేషన్ కు వెళ్లాడు. అనిల్ తోపాటే పనిచేసే మాధురి రేచర్ల కూడా అదే సమయంలో ఎడిసన్ స్టేషన్ కు వచ్చింది. కూతవేటు దూరంలో రైలు ఉండగా.. ఉన్నట్టుండి మాధురి రైలు పట్టాలపై పడిపోయింది. ఇది గమనించిన అనిల్.. తన భుజానికున్న బ్యాగును ఫ్లాట్ ఫాంపై  విసిరేసి, ఆమెను కాపాడేందుకు కిందికి దూకాడు. అప్పటికే మాధురి కాలువిరిగి కదలలేని స్థితిలో ఉంది. ఎలాగోలా ఆమెను పట్టాల నుంచి దూరంగా తీసుకొచ్చాడు అనిల్. ఈ క్రమంలో మరో ఇద్దరు యువకులు అతనికి సాయపడ్డారు.

 

కొద్ది గంటలుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసించానని, అందువల్లే కళ్లుతిరిగి పట్టాలపై పడిపోయానని మాధురి మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. తనను కాపాడిన అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

చేదు అనుభవం: ఎడిసన్ స్టేషన్ లో చోటుచేసుకున్న ఘటనను అక్కడున్నవారంతా ఉత్కంఠగా గమనిస్తుంటే ఒక దొంగ మాత్రం తాపీగా తనపని చేసుకుపోయాడు. మాధురిని కాపాడే క్రమంలో అనిల్ ఫ్లాట్ ఫాంపై వదిలివెళ్లిన బ్యాగును దొంగిలించాడు. అందులో విలువైన ల్యాప్ టాప్, కొంత డబ్బు, ఐడీ కార్డులు ఉన్నాయని చెప్పిన ఎడిసన్ పోలీసులు.. తమ ఫేస్ బుక్ పేజీలో ఇలా రాశారు.. "దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో.. అదికూడా సాయం చేయడానికి ముందుకొచ్చిన వారి వస్తువుల్ని తస్కరించడం దారుణం" అని! 

 

అనిల్ కు నగదు పురస్కారం: ప్రాణాలు లెక్కచేయకుండా సాటి మనిషి కోసం సాహసం చేసిన అనిల్ ను అమెరికా పోలీసులు అభినందించారు. ఈ ఘటనలో తన బ్యాగ్ ను కోల్పోయిన అనిల్ కు పరిహారంగా వెయ్యి డాలర్ల చెక్కును అందించారు.


 


 


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top