భారత మహిళలకు ‘ఉగ్ర’ శిక్షణ

భారత మహిళలకు ‘ఉగ్ర’ శిక్షణ


* ‘బర్ద్వాన్’ ప్రధాన నిందితురాలు ఫాతిమా వెల్లడి

* ఢాకాలో అరెస్టు చేసిన అక్కడి పోలీసులు

* నేడో రేపో తీసుకురానున్న ఎన్‌ఐఏ అధికారులు

* రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం




సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ బాంబు పేలుడు కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఫాతిమాబేగం(35)ను బంగ్లాదేశ్‌లోని ఢాకాలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నేడో రేపో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఏఐ) అధికారులు ఆమెను భారత్‌కు తీసుకురానున్నారు. అయితే ఆమె అక్కడి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భారత్‌లోని 25 మంది మహిళలకు పాక్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించామని పేర్కొంది. దీంతో పోలీసులు  మహిళా ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు.



బర్ధ్వాన్ కేసులో వారం క్రితం హైదరాబాద్‌లోని బార్కస్ రాయల్‌కాలనీకి చెందిన బర్మా శరణార్ధి ఖలీద్(28) అరెస్టు అయిన విషయం తెలిసిందే. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఫాతిమాను అరెస్టు చేశారు. ఆమె వెల్లడించిన అంశాలపై నిఘా సంస్థలు  దృష్టి సారించాయి. ఈ విషయంపై రాష్ట్రాలను కేంద్ర ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసింది. బర్మా నుంచి శరణార్ధులుగా వచ్చి రాయల్ కాలనీలో స్థిరపడిన మహిళల గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల ఓ మెడికో ఇరాక్‌లో ఉగ్రశిక్షణకు వెళ్లేందుకు సిద్ధపడిన విషయం తెలియడంతో పోలీసులు యువతిని ఆమె కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసి పంపించారు.



ఇదే తరహాలో ఎవరైనా వెళ్లారా?, శిక్షణ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చారా? అనే విషయాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి పాల్పడినవారు, పేలుడు కేసులో నిందితులు ఒక్కరేనని తేలింది. దీంతో బర్ధ్వాన్ కేసులో పట్టుబడిన హఫీజ్‌మొల్లా, షేక్‌అహ్మద్, హసన్‌సాహెబ్, రజియా బీబీ, అలీ మా బీబీలకు బ్యాంక్ దోపిడీలో పాత్రపై ఆరా తీస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top