హేమమాలినిపై సానుభూతి ఎందుకు?

హేమమాలినిపై సానుభూతి ఎందుకు? - Sakshi


జైపూర్: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని కారు యాక్సిడెంట్‌పై సామాజిక వెబ్‌సైట్లలో వివాదం రాజుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన హేమ మాలిని కారు కారణంగానే ఆల్టో కారులోని నాలుగేళ్ల చిన్నారి చనిపోతే, ఆరేళ్ల బాలుడు రెండు కాళ్లు దెబ్బతింటే వారి పట్ల సానుభూతి చూపించాల్సిందిపోయి మీడియాగానీ, ప్రభుత్వంగానీ హేమమాలిని పట్ల సానుభూతి ఎందుకు చూపిస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.



తన కారు కారణంగా చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి, ఆమె సోదరుడిని ఆస్పత్రికి తరలించాల్సిన బాధ్యతను విస్మరించి తాను మాత్రం ఆస్పత్రికి తరలిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో సల్మాన్ ఖాన్‌లా ప్రవర్తించడం కాదా అని నెటజన్లు ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.



దారినపోతున్న డాక్టరయ్య కారణంగా అయితేనేమి జైపూర్‌లోని ఫోర్టీస్ ఆస్పత్రికి హేమ మాలిని తరలిస్తే, బాధితులను మాత్రం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారా ? ఇదేమి వివక్ష ? వీఐపీలు, సామాన్యులు సమానమేనంటూ ఎప్పుడు గొంతు చించుకుని ఆరిచే మీడియా అసలు బాధితులను పట్టించుకోకుండా, నొసటికి గాయమైన హేమ మాలిని కవరేజీకి ప్రాధాన్యతనివ్వడం ఆత్మవంచన కాదా? అని సూటిగా అడుగుతున్నారు.



‘ఆల్టోను ఒవర్ టేక్ చేయబోతే యాక్సిడెంట్ అయినట్టుగా హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ చెబుతున్నారు. అదే నిజమైతే హేమ కారుకు ముందున కుడివైపు, ఆల్టోకు వెనుక ఎడమ వైపు ఎలా దెబ్బలు తగులుతాయి' అని మరో నెటిజన్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఓ పోలీసు అధికారి మాత్రం హేమమాలిని కారు అతి వేగం కారణంగా డివైడర్ మీది నుంచి దూసుకెళ్లడం వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పారు. రాజస్థాన్‌లోని దౌసా వద్ద గురువారం సాయంత్రం యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top