రామ్‌దేవ్‌ బాబాకు డోపింగ్‌ టెస్ట్‌ జరపాలట

రామ్‌దేవ్‌ బాబాకు డోపింగ్‌ టెస్ట్‌ జరపాలట


న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ రెజ్లింగ్‌ లీగ్‌ పోటీల్లో  ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న 34 ఏళ్ల ఆండ్రీ స్టాండిక్‌ను 51 ఏళ్ల యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మట్టి కరిపించడం పట్ల సోషల్‌ మీడియా తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతోంది. ఉత్తమ సహాయ నటుడిగా ఆండ్రీకి ఆస్కార్‌ అవార్డును ఇవ్వాలని ఒకరు, గోమూత్రం తాగి శక్తిని తెచ్చుకున్నారని నిరూపించిందుకు డోపింగ్‌ టెస్ట్‌ను నిర్వహించాలని మరొకరు, క్రికెట్‌ క్రీడను కూడా రామ్‌దేవ్‌ బ్యాటింగ్‌తో ప్రారంభిస్తే భారత్‌కు విజయం తప్పదని ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు.



పతంజలి ఉత్పత్తుల యాడ్‌ సంస్థనే ఈ లీగ్‌ పోటీలను స్పాన్సర్‌ చేసిందికనుక ముందస్తు అంగీకారం మేరకే  గతంలో రెండుసార్లు భారత రెజ్లింగ్‌ చాంపియన్‌ సుశీల్‌ కుమార్‌ను గిరాగిరా తిప్పి గిరాటేసిన ఒలింపిక్స్‌ రెజ్లర్‌ ఆండ్రీ స్టాండిక్‌ ఓడిపోయారన్నది అందరికి తెల్సిందే. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినా చూచాయిగానన్న చెప్పడం యోగా గురు రామ్‌దేవ్‌ కనీస ధర్మం. అది ఆయన చేయకపోగా తాను చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నానని, ఆ బ్రహ్మ నుంచి శక్తిని సాధించానని చెప్పి అమాయకులను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం కచ్చితంగా నైతిక విలువలు లేకపోవడమే అవుతుంది.



ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు కుమ్మరిస్తూ పతంజలి ఉత్పత్తుల మార్కెటింగ్‌ ప్రచారం చేస్తున్న రామ్‌దేవ్, అందులో భాగంగానే ఈ ఉత్తుత్తి రెజ్లింగ్‌ ఆట ఆడారు. తనకున్న వ్యక్తిగత ప్రతిష్టకు మార్కెటింగ్‌ ప్రచారాన్ని కూడా జోడిస్తే తమ ఉత్పత్తులకు ఎలాంటి ఢోకా ఉండదన్నది ఆయన ఆత్మవిశ్వాసం. అది నిజమవుతోంది కూడా. 2011–12 సంవత్సరంలో 446 కోట్ల రూపాయల పతంజలి ఉత్పత్తుల సామ్రాజ్యాన్ని 2015–2016 నాటికి 5,000 కోట్ల రూపాయలకు అలాగే పెంచుకున్నారు. ఆయన తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం పలు టీవీ ఛానళ్లలో ఎన్నో కార్యక్రమాలను స్పాన్సర్‌ చేస్తున్నారు. ఆయన తరఫున ప్రచారానికి ‘వెర్మీలియన్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ కంబైన్డ్‌ మీడియా’ కషి చేస్తున్న విషయం కూడా తెల్సిందే.



పతంజలి ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక్క 2015–2016 సంవత్సరానికే రామ్‌దేవ్‌ 360 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పుడు ఆండ్రీ స్టాండిక్‌ ఓటమి కోసం ఆయనకు ఎన్ని కోట్ల రూపాయలు ముట్టచెప్పారో వారికే తెలియాలి. యోగా ద్వారా రెజ్లింగ్‌లో విజయం సాధించేంత శక్తి వచ్చేటట్లయితే ఒలింపిక్స్‌లో మన రెజ్లర్లను గెలిపించడం కోసం  కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రామ్‌దేవ్‌ను శిక్షకుడిగా చేర్చుకుంటే చాలని కూడా సోషల్‌ మీడియాలో సూచనలు వస్తున్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top