1934 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం

1934 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం - Sakshi


- మరో 10-15 రోజులు భూకంపాలు కొనసాగే అవకాశం

- ఎన్‌జీఆర్‌ఐ భూకంప శాస్త్రవేత్త ఆర్‌కే చద్దా




 హైదరాబాద్: ప్రస్తుతం భూకంపం సంభవించిన నేపాల్ ప్రాంతంలో మరో 10-15 రోజులపాటు చిన్న చిన్న భూకంపాలు వస్తాయని జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ముఖ్య శాస్త్రవేత్త ఆర్‌కే చద్దా తెలిపారు. శనివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు 80 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భారీ భూకంపం.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీని ప్రభావం, భవిష్యత్తు పరిణామాలు, రాష్ట్రంలో భూకంపాల వాతావరణం తదితర అంశాలపై హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త ఆర్‌కే చద్దాను సాక్షి ప్రతినిధి సంప్రదించారు.



వివిధ అంశాలపై ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. నేపాల్ ప్రాంతంలో 1934 తర్వాత ఇదే అతి పెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.9 గా నమోదైంది. పరిమాణం రీత్యా దీనిని భారీ భూకంపంగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఇంత భారీ భూకంపం ప్రభావం ఆ ప్రాంతంపై 10 నుంచి 15 రోజులపాటు ఉంటుంది. ఈ కాలంలో చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. అయితే ప్రభావం తక్కువగా ఉంటుంది.


ఎన్‌జీఆర్‌ఐ రికార్డుల ప్రకారం శనివారం మధ్యాహ్నం 11.41 గంటలకు నేపాల్ రాజధాని ఖాట్మండుకు నార్త్ వెస్ట్‌గా 80 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించింది. తదుపరి సాయంత్రం 4.30 గంటలలోపు వరుసగా 15 భూకంపాలు నమోదయ్యాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6.6గా నమోదైంది. నేపాల్ రీజియన్, పరిసర ప్రాంతాల్లో ఇది అతి పెద్ద భూకంపం. 1934లో నేపాల్ - బీహార్ సరిహద్దులో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.4గా నమోదైంది. తర్వాత ఇదే పెద్దది.



అప్పుడూ ఇప్పుడూ అదే ప్రాంతంలో....

1934లో భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఇప్పుడు కూడా వచ్చింది. ఇది అతి ప్రమాదకరమైన అయిదో జోన్ (హిమాలయాల ప్రాంతం)లో ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాలను తీవ్రతను బట్టి శాస్త్రవేత్తలు అయిదు జోన్లుగా వర్గీకరించారు. ఇందులో హిమాలయాల ప్రాంతం అయిదో జోన్ కిందకు వస్తుంది. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. అందువల్ల వీటిని తట్టుకునే విధంగా భవనాలు నిర్మించుకుంటారు. ఇప్పుడు నేపాల్‌లో కూలిపోయిన భవనాలు పురాతనమైనవే. గతంలో భారీ భూకంపం వచ్చిన సందర్భంగా జపాన్‌లోనూ ఇలాగే పురాతన భవనాలన్నీ కూలిపోయాయి. భూకంప తీవ్రతను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top