నెల్లూరును వీడని వరద బాధ!

వరదనీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నెల్లూరులోని చౌటమిట్ట గిరిజన కాలనీ ప్రజలు - Sakshi


నెల్లూరు(టౌన్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాను వర్షం బాధలు వీడటం లేదు. చాలాచోట్ల ప్రజలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం జిల్లావాసులను వణికిస్తోంది. సోమవారం కురిసిన వర్షాలతో వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ ఉధృతి మంగళవారం కూడా కొనసాగింది. సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించినా బాధితులకు కష్టాలు తప్పడం లేదు.



వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, రూరల్ మండలాల్లోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అంధకారంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అరకొర సహాయమే అందుతుంది. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు అందించిన ఆహార పొట్లాలతోనే ఆకలి బాధ తీర్చుకుంటున్నారు.

 

జిల్లాలో అపార నష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లావ్యాప్తంగా రూ.4 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. చలిగాలులు, వరదలకు కొట్టుకుపోయి జిల్లావ్యాప్తంగా 180 మంది మృత్యువాతపడ్డారు. గూడూరు, రాపూరు, వెంకటగిరి, కోట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో వందల కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

 

ఒక్క అధికారి కూడా మా కాలనీకి రాలేదు...

గత వారంరోజులుగా మా ప్రాంతంలోని ఇళ్లు నీటమునకలోనే ఉన్నాయి. అయితే ఒక్క అధికారి కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ మా ప్రాంతానికి వచ్చి పరామర్శించలేదు. దీంతో విద్యుత్ సరఫరాలేక, ఇళ్ళలోని వస్తువులు నీటమునగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.

 - సుగుణమ్మ(వహవీర్ కాలనీ, మద్రాసు బస్టాండు)

 

 ఎనిమిది రోజులుగా నీటిలో ఉంటున్నాం

 భారీవర్షాలు కారణంగా మా ప్రాంతంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో ఎనిమిది రోజులుగా నీటిలోనే ఉంటున్నాం. విద్యుత్ సరఫరా లేక, కూలిపనులకు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.  స్వచ్చంద సంస్థలు ఇచ్చే ఆహార పొట్లాలతో కడుపునింపుకొంటున్నాం.

 - కుప్పుస్వామి(మన్సూర్‌నగర్)

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top